కరుడుగట్టిన లెఫ్టిస్ట్ ఏచూరి.. మేనమామ ఐఏఎస్ మోహన్ కందానే మార్చేసేంత

అయితే, మేనల్లుడు ఏచూరి కంటే ఏడేళ్లు మాత్రమే పెద్దయిన మోహన్ కందా సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది.

Update: 2024-09-12 13:30 GMT

కమ్యూనిస్టు దిగ్గజం సీతారాం ఏచూరిది ఘనమైన కుటుంబ నేపథ్యం. తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగి. తల్లి కల్పకం ఏచూరి సంఘ సంస్కర్త. స్వాతంత్ర్య సమరయోధురాలు దుర్గాబాయ్ దేశ్ ముఖ్ శిష్యురాలు. కల్పకం సోదరుడే ప్రముఖ ఐఏఎస్ అధికారి మోహన్ కందా. ఈయన ఉమ్మడి ఏపీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అది కూడా అటు చంద్రబాబునాయుడు, ఇటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరి ప్రభుత్వాలలోనూ పనిచేసిన ప్రత్యేకత ఆయన సొంతం. అయితే, మేనల్లుడు ఏచూరి కంటే ఏడేళ్లు మాత్రమే పెద్దయిన మోహన్ కందా సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది.

వామపక్ష కెరటం..

సీతారాం ఏచూరి కరుడుగట్టిన వామపక్షవాది. అయినా చదువులో ముందుండేవారు. హైదరాబాద్ ఆల్ సెయింట్స్ హైస్కూల్‌ లో మెట్రిక్యులేషన్ తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్‌ లో చేరారు. 1970లో సీబీఎస్‌సీ హయ్యర్ సెకండరీ పరీక్షలో దేశంలోనే నంబర్ వన్ గా వచ్చారు. ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో బీఏ పూర్తి చేశారు. జేఎన్‌యూ నుంచి ఎంఏ పూర్తిచేశారు. పీహెచ్‌డీలో చేరినా.. ఎమర్జెన్సీలో అరెస్టు కావడంతో కొనసాగించలేకపోయారు.

మేనమామనే మార్చేసేంత..

సీతారాం ఏచూరి మరింత బాగా చదవాలనే ఉద్దేశంతో ఆయనను తన తమ్మడు మోహన్ కందా వద్దకు పంపారు కల్పకం. కొన్నాళ్ల తర్వాత అక్క కల్పకంకు లేఖ రాశారు మోహన్ కందా. అందులో ఏముందంటే.. ‘‘అక్కయ్యా.. మేమిక్కడ బాగానే ఉన్నాం. సీతారాం కూడా బాగానే ఉన్నాడు. అయితే, వాడు చదువుకుని పైకి రావడం ఏమో కానీ.. వాడి కరుడుగట్టిన వామపక్ష భావజాలంతో నేను లెఫ్టిస్ట్ గా మారిపోయే ప్రమాదంలో ఉన్నాను. వాడిని నా దగ్గరనుంచి తీసుకెళ్తే నాకు ప్రయోజనం’’ అని ఆవేదన వ్యక్తం చేశారట.

మోహన్ కందా అంటే ఐఏఎస్ వర్గాల్లో చాలా మంచి పేరు. హైదరాబాద్ నంది హిల్స్ లో ఆయన నివాసం ఉంటుంది. అటుగా వెళ్తున్నవారికి.. ఆరుబయట కుర్చీలో కూర్చుని కాఫీ, టీ కప్పుతో కనిపిస్తుంటారు. కాగా, మోహన్ కందా వయసు 79. ఆయన కంటే ఏడేళ్లు చిన్నవారు సీతారాం ఏచూరి.

Tags:    

Similar News