"చంద్రబాబుచల్లగా ఉండాలి".. వైరల్ గా మోహన్ బాబు "విజ్ఞప్తి"!
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై రాజకీయ నాయకులతో పాటు పలువురు సినీ ప్రముఖులూ వారి వారి స్పందనను తెలియజేస్తున్నారు. ఈ సమయంలో నటుడు, నిర్మాత, పద్మశ్రీ మంచు మోహన్ బాబు స్పందించారు. ఈ సందర్భంగా ఎక్స్ లో ఓ విజ్ఞప్తి చేశారు!
అవును.. ఇప్పుడు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు వాడారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఇప్పటికే ప్రకాశ్ రాజ్ - మంచి విష్ణు మధ్య ఎక్స్ వేదికగా స్పందనల షేరింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మోహన్ బాబు స్పందించారు. ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా.. "ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ హిందూ పూజించే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి" అని మొదలుపెట్టిన మోహన్ బాబు... ఆ దైవానికి నిత్యం సమర్పించే లడ్డూలో కలిపే ఆవు నెయ్యిలో మూడు నెలల క్రితం వరకూ జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఓ భక్తుడిగా తల్లడిల్లిపోయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు వెల్లడించారు.
ఇక నిత్యం "మోహన్ బాబు యూనివర్శిటీ" నుంచి కనిపించే తిరుమల క్షేత్రాన్ని చూసి తనతో పాటు వేలాదిమంది ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, నిత్యం భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటామని తెలిపారు. ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేయం, అరాచకం అంటూ ఎంబీ ఆగ్రహం వ్యక్తం చేశారు!
ఈ సందర్భంగా... వినిపిస్తున్న ఆరోపణలు నిజమైతే నేరస్థులను శిక్షించాలని నా ఆత్మీయుడు, నా మిత్రుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ఈ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు నా మిత్రుడు అందుకుని నూరేళ్లు చల్లాగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.