ఫ్లడ్ లైట్లు.. బరి.. కోడి పందేల సెటప్ లెక్కే వేరట!

రెండు రోజుల క్రితం హైదరాబాద్ మహానగర శివారులో నిర్వహించిన భారీ కోడి పందేలకు సంబంధించి సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి.

Update: 2025-02-13 04:27 GMT

రెండు రోజుల క్రితం హైదరాబాద్ మహానగర శివారులో నిర్వహించిన భారీ కోడి పందేలకు సంబంధించి సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి. మొయినాబాద్ మండలం తొల్కట్టలోని ఒక ఫామ్ హౌస్ లో జరుగుతున్న ఈ భారీ కోడి పందేల సెటప్ చూస్తే మతి పోతుందనిచెబుతున్నారు. దీనికి కారణం సంక్రాంతి వేళలో.. ఏపీలోని గోదావరి జిల్లాల్లో ఏర్పాటు చేసే పండుగ బరులకు ఏ మాత్రం తగ్గని రీతిలో ఇవి ఉండటం గమనార్హం.

మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పోలీసులు నిర్వహించిన దాడుల్లో 61 మంది చిక్కారు. వీరి నుంచి రూ.30 లక్షల క్యాష్ తో పాటు.. రూ.కోటి పైనే బెట్టింగ్ కాయిన్లు పోలీసులకు చిక్కాయి. 80 కోళ్లు.. 50 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఎక్కువ మంది వ్యాపారులే ఉన్నట్లు చెబుతున్నారు. కోడి పందేల్ని నిర్వహిస్తున్న బరి వద్ద చేసిన ఏర్పాట్లు చూసిన పోలీసులు సైతం విస్మయానికి గురైనట్లుగా తెలుస్తోంది. భారీ ఫ్లెడ్ లైట్ల వెలుతురులో ఈ పోటీల్నినిర్వహిస్తున్నట్లుగా తేలింది. కోడి పందేల్ని చూసేందుకు గ్యాలరీలను కూడా ఏర్పాటు చేయటం చూసిన వారంతా పక్కా ఏర్పాట్లతో పందేల్ని నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఇంతకూ ఈ ఫామ్ హౌస్ ఎవరిది? అన్నది ప్రశ్నగా మారింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి చెందిన ఫామ్ హౌస్ గా చెబుతున్నారు. దాదాపు 11 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫాంహౌస్ లో ఏపీలోని కోనసీమ జిల్లాకు చెందిన వ్యాపారి భూపతిరాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ ఈ పందేల్ని నిర్వహిస్తున్నట్లుగా తేలింది. ప్రస్తుతం నార్సింగ్ లో ఉండే ఇతడు.. ఏపీలో కోడి పందేల నిర్వహణలో మంచి అనుభవం ఉందని చెబుతున్నారు. ఇతడ్ని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. కోడి పందేలు జరుగుతున్న ఫామ్ హౌస్ ను తాను లీజ్ కు ఇచ్చినట్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చెప్పినా.. పోలీసుల విచారణలో అదేమీ నిజం కాదని తేలినట్లుగా తెలుస్తోంది. గడిచిన రెండేళ్లుగా ఇక్కడ కోడి పందేలు.. క్యాసినో నిర్వహిస్తున్న సమాచారం బయటకు రావటంతో.. ఇంతకాలం పోలీసులు ఏం చేస్తున్నట్లు? అన్నది ప్రశ్నగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీని కూడా నిందితుల జాబితాలో చేర్చాలన్న అంశం మీద పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. ఆయనకు నోటీసులు ఇస్తారని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News