నిరసన కోసం మొనాలిసా పెయింట్ దగ్గర ఇలా రచ్చ చేయాలా?
నిరసన అందరి హక్కు. ప్రజాస్వామ్యదేశాల్లో ప్రభుత్వం మీద తమకున్న అభ్యంతరాల్ని వ్యక్తం చేసేందుకు నిరసన ఒక ఆయుధం.
నిరసన అందరి హక్కు. ప్రజాస్వామ్యదేశాల్లో ప్రభుత్వం మీద తమకున్న అభ్యంతరాల్ని వ్యక్తం చేసేందుకు నిరసన ఒక ఆయుధం. అలాంటి ఆయుధాన్ని ఇష్టారాజ్యంగా వినియోగిస్తే.. ఆ తీరును కచ్ఛితంగా ఖండించాల్సిందే. తాజాగా అలాంటి ఉదంతం ఒకటి ఫ్రాన్స్ లో చోటు చేసుకుంది. రైతుల సమస్యలపై ఆ దేశంలో పర్యావరణ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇద్దరు పర్యావరణ కార్యకర్తలు ప్రపంచ ప్రఖ్యాత మోనాలిసా చిత్రం ఉన్న లౌవ్రే మ్యూజియంలోకి వెళ్లి.. ఆ పెయింట్ గాజుపలక మీద సూప్ చల్లి తమ నిరసనను తెలియజేశారు. పారిస్ లో చోటు చేసుకున్న ఈ ఘటనను పలువురు తప్పు పడుతున్నారు. న్యాయమైన అంశాలతో ఆందోళన.. నిరసన చేయటం బాగానే ఉన్నా.. ఇలా గతి తప్పిన రీతిలో నిరసన తెలియజేయటం సరికాదంటున్నారు.
వ్యవసాయ రంగం దుర్బరంగా ఉందని.. రైతులు ప్రాణాలు కోల్పోతున్నట్లుగా వారు మండిపడుతున్నారు. ఇందులో భాగంగా మెనాలిసా పెయింట్ గ్లాస్ బాక్స్ మీద సూప్ చల్లిన అనంతరం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో.. ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఈ ఉదంతంలో ఇద్దరు పర్యావరణ కార్యకర్తల్ని అరెస్టు చేశారు.
సాంకేతిక విధానాల్ని సరళీకరించాలని.. వాహనాలకు డీజిల్ ఇంధన పన్నును రద్దు చేయాలి.. ఇలాంటి పలు డిమాండ్లతో ఆందోళన చేస్తున్నారు. నిరసన తెలియజేయటం మంచిదే కానీ జాతిసంపదగా భావించే వాటిని ధ్వంసం చేయాలన్న తీరును తప్పు పడుతున్నారు. అయితే.. అంతర్జాతీయ సమాజం చూపు తమ నిరసనపై పడేలా చేయటం కోసమే ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. తమ దేశంలో రైతుల సమస్యలు ప్రపంచం మాట్లాడుకునేలా చేయటం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచటమే వారి లక్ష్యమని చెబుతున్నారు.