జంపింగ్ కంటే.. రాజీనామా మేలు?
ఇక ఏపీలో చూస్తే పరిమళ్ నత్వానీ వంటి బడా వ్యాపారవేత్తను గతంలో రాజ్యసభకు పంపారు. ఇవన్నీ ఉదాహరణలే.
పార్లమెంటులో పెద్దల సభగా పేర్కొన్న రాజ్యసభ కాస్త ప్రత్యేకం. లోక్ సభలో బంపర్ మెజారిటీ ఉండి అధికారం చేపట్టిన పార్టీకీ రాజ్యసభలో బలం లేకపోవచ్చు. ఉదాహరణకు నరేంద్ర మోదీ రెండో విడత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. రాజ్యసభలో విపక్షాలది పై చేయి కావడంతో కీలక బిల్లులు పాస్ అయ్యే అంశంలో ఇబ్బందులు తప్పలేదు. మూడో విడతలోనూ మోదీ సర్కారుకు రాజ్య సభలో బలం లేదు. కాగా, ఆరేళ్ల పదవీ కాలం ఉండే పెద్దల సభ సభ్యుల్లో కొందరు పార్టీలకు అతీతంగా ఎన్నికైన వారుంటారు. మరికొందరు మేధావులు.. ఇలా విభిన్న వర్గాల వారు ఉంటారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే.. ఇటీవల తెలంగాణ నుంచి అభిషేక్ సింఘ్వీని రాజ్యసభకు పంపారు. సీనియర్ న్యాయవాది అయిన సింఘ్వీ అవసరం పార్టీకి ఉందని రాజ్యసభకు పంపినట్లు సమర్థించుకున్నారు. ఇక ఏపీలో చూస్తే పరిమళ్ నత్వానీ వంటి బడా వ్యాపారవేత్తను గతంలో రాజ్యసభకు పంపారు. ఇవన్నీ ఉదాహరణలే.
ఫిరాయించొద్దు.. రాజీనామా చేసేద్దాం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రెండు నెలల కిందట బీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కె.కేశవరావు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రె స్ లో చేరారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో అత్యంత కీలక నాయకుడిగా ఎదిగిన కేకే తిరిగి సొంత గూటికి చేరారు. వాస్తవానికి కేకే రాజ్యసభ సభ్యత్వం గడువు ఉన్నప్పటికీ ఆయన రాజీనామానే ఆశ్రయించారు. ఆ స్థానంలో సింఘ్వీని ఎన్నుకున్నారు. కేకేను తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ ర్యాంకుతో గౌరవించింది. ఇప్పుడు సింఘ్వీ పదవీ కాలం 2030 వరకు ఉంది.
కేకే దారిలోనే బీద, మోపిదేవి
సీనియర్ సభ్యుడైన కేకే దారిలోనే ఏపీకి చెందిన ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు నడిచారు. మోపిదేవీ 2026 వరకు ఎంపీగా కొనసాగవచ్చు. మస్తాన్ రావు అయితే, 2028 వరకు ఉండొచ్చు. కానీ, వీరిద్దరూ వైసీపీకి రాజీనామా చేశారు. మోపిదేవి టీడీపీలో చేరతానని ప్రకటించారు. మస్తాన్ రావు నిర్ణయం ఏమిటో చూడాలి. కాగా, మస్తాన్ రావు నేపథ్యం టీడీపీనే. మరోవైపు వీరు ఎందుకు రాజీనామా చేశారు..? అంటే ఖాళీ అయిన స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తే ఆరేళ్లు ఎంపీగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఒకవేళ చేరిన పార్టీ వీరిని ఎంపీలుగా ఎంపిక చేసినా చేయకున్నా.. ఇది వారు పాత పార్టీతో సంబంధం తెంచుకునే ప్రయత్నమే. మరోవైపు ఫిరాయింపు ఆరోపణ కూడా ఉండదు. తద్వారా వేటు వేయాలని, అనైతిక రాజకీయమని విమర్శించే చాన్సుండదు. అన్నిటికి మించి కొత్తగా ఎన్నికయ్యేవారికి ఆరేళ్ల పూర్తి పదవీ కాలం దక్కుతుంది.
ఖాళీలన్నీ కూటమి ఖాతాలోకే
టీడీపీకి ప్రస్తుతం రాజ్యసభలో ఒక్కరే సభ్యుడు (కనకమేడల రవీంద్రకుమార్) ఉన్నారు. మోపిదేవి, బీద రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలను టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి (164 మంది ఎమ్మెల్యేలు) ఖాయంగా గెలుచుకుంటుంది. ఇకపై ఎవరు రాజీనామా చేసి వచ్చినా ఆ ఎంపీ సీట్లు కూడా కూటమి ఖాతాలోకే వెళ్తాయి. అంటే.. అటు ఫిరాయింపు అనే అపవాదు ఉండదు. ఇటు అధికారికంగా గెలుచుకున్నామన్న పేరూ దక్కుతుంది.