ఆందోళన కలిగిస్తున్న జర్నలిస్టుల మరణాలు.. ఒక్క ఏడాదిలోనే ఇంత మందా..

ఇంకా అలాంటి పరిస్థితుల్లోనూ ఎక్స్‌క్లూజివ్ అంటూ వార్తా సేకరణకు పోరాడుతుంటారు.

Update: 2024-12-10 19:30 GMT

ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నా.. ఎలాంటి ఉద్రిక పరిస్థితులు ఉన్నా.. వార్త కవరేజీలో జర్నలిస్టులు వెనక్కి పోరు. ఇంకా అలాంటి పరిస్థితుల్లోనూ ఎక్స్‌క్లూజివ్ అంటూ వార్తా సేకరణకు పోరాడుతుంటారు. ప్రాణాలను సైతం రిస్క్‌లో పెట్టి ఫొటోల కోసం, వార్తా సేకరణ కోసం పరిగెడుతుంటారు. అలా... రిస్క్ ఘటనలను కవర్ చేస్తూ ఒక్క ఏడాదిలోనే 104 జర్నలిస్టులు మృతిచెందడం విషాదానికి గురిచేసే అంశం.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏ స్థాయిలో కొనసాగాయో చూశాం. అలాగే.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. ఇలా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులే కనిపించాయి. కాగా.. ఈ ఉద్రిక్తతలకు సంబంధించిన సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు తమ ప్రాణాలను రిస్క్ చేస్తున్నారు. ఇలా పలువురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా.. అది సంతోషకరమైన వార్త అయినా.. కన్నీళ్లు తెప్పించే సమాచారం అయినా ప్రజలకు తెలియజేసేందుకు జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నారు.

ఇటీవల కాలంలో యుద్ధరంగంలో సైతం ప్రాణాలకు తెగించి కలం వీరులు వార్తలు సేకరించారు. ఫొటో జర్నలిస్టులు సైతం మంచి మంచి ఫొటోలను తీశారు. వాటన్నింటినీ ప్రజలకు చేరవేశారు. ఈ క్రమంలో గాజాలో నెలకొన్న ఉద్రిక్తతలను ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రయత్నించిన జర్నలిస్టులు యుద్ధంలో మరణించడం అత్యంత విచారకరం. ఈ ఒక్క ఏడాదే ప్రపంచ వ్యాప్తంగా 104 మంది జర్నలిస్టులు చనిపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అందులో కేవలం గాజాలోనే 81 మంది చనిపోవడం విషాదకరం.

ఈ మేరకు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఓ నివేదికను వెల్లడించింది. ఏడాదిలో 104 మంది జర్నలిస్టులు చనిపోయినట్లు తెలిపింది. 2023లో ఏడాది మొత్తంలో 129 మంది చనిపోయినట్లు పేర్కొంది. అయినప్పటికీ ఈ ఏడాది అత్యంత ఘోరమైన సంవత్సరంగా నిలిచిందని ఐఎఫ్‌జే ప్రధాన కార్యదర్శి ఆంథోని బెల్లాంగర్ తెలిపారు. 2023 అక్టోబరు 7న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 14 నెలల కాలంలో గాజాలో 138 మంది జర్నలిస్టులు చనిపోయారు. వారిలో చాలా మందిని ఉద్దేశ పూర్వకంగా చంపినట్లు ప్రచారం ఉంది. ఇక ఆసియాలో 20 మంది జర్నలిస్టులు చనిపోయారు. వారిలో ఆరుగురు పాకిస్తాన్‌లో, ఐదుగురు బంగ్లాదేశ్‌లో, నలుగురు ఉక్రెయిన్ యుద్ధంలో, ముగ్గురు భారత్‌లో చనిపోయినట్లు నివేదికలో వెల్లడించింది. ఇక.. ప్రపంచ వ్యాప్తంగా 520 మంది జర్నలిస్టులు జైలులో ఉన్నట్లు ఐఎఫ్‌జే తెలిపింది. 135 మంది జర్నలిస్టులను హాంకాంగ్‌లో నిర్బంధించినట్లు తెలిపింది. ప్రభుత్వ చర్యలను ప్రశ్నించినందుకే వారికి ఈ విధంగా శిక్ష విధించారని పేర్కొంది.

Tags:    

Similar News