భారత్ లో ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్‌? అతడిపై అమెరికా అబద్ధాలాడుతోందా?

కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్.. అమెరికాలో గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ.. నిజ్జర్ గత ఏడాది హత్యకు గురయ్యాడు.

Update: 2024-10-20 22:30 GMT

కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్.. అమెరికాలో గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ.. నిజ్జర్ గత ఏడాది హత్యకు గురయ్యాడు. భారత ఏజెంట్లే ఈ పని చేశారని కెనడా కడుపు చించుకుంటోంది.. దీనిపైనే ఇటీవల రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో వెలుగులోకి వచ్చింది గురుపత్వంత్ సింగ్ పన్నూపై హత్యాయత్నం. తమ గడ్డపైన కుట్ర జరగడంతో అమెరికా ఆగ్రహంగా ఉంది. దీనివెనుక ఉన్నది వికాస్ యాదవ్ అని చెబుతోంది. ఇంతకూ ఎవరీ వికాస్ యాదవ్.. ఎక్కుడున్నాడు అతడు?

మా వాడిపై అమెరికావన్నీ అబద్ధాలే..

అమెరికాలో ఉండే గురుపత్వంత్‌ పన్నూ హత్యకు నిరుడు వికాస్‌ యాదవ్‌ విఫలయత్నం చేశాడనేది అభియోగం. దీనిపై అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌ మెంట్‌ కేసు నమోదు చేసింది. అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) వాంటెడ్‌ లిస్టులో కూడా చేర్చింది. వికాస్ భారత ప్రభుత్వ ఉద్యోగి (రా-రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) అని చెబుతోంది. భారత్‌ మాత్రం వికాస్ ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు అమెరికాకు స్పష్టం చేసింది. ఇప్పుడు తెరపైకి వికాస్‌ యాదవ్‌ తల్లి సుధేశ్‌ యాదవ్‌ వచ్చారు. అమెరికా ప్రభుత్వం నిజాలు మాట్లాడడం లేదని ఆరోపించారు. తన కుమారుడు దేశం కోసం పనిచేస్తున్నాడని.. అమెరికా చెప్పేది నిజమో.. అబద్ధమో పక్కనపెడదామని పేర్కొన్నారు.

సీఆర్పీఎఫ్ లో విధులు..

ఢిల్లీకి 100 కిలోమీటర్ల దూరంలోని ప్రాణపురలో వికాస్‌ బంధువులు ఉంటున్నారు. వీరిలో ఒకరు ఇంగ్లిష్ మీడియాతో మాట్లాడుతూ.. పన్నూను హత్య చేసేంతటి డబ్బు తమ వాడికి ఎక్కడిదని ప్రశ్నించారు. వికాస్ ఇంటి ముందు ఖరీదైన ఆడీ, మెర్సిడెస్‌ కార్లు న్నాయా? అని ప్రశ్నించారు. తనపై మీడియాలో వస్తున్నవన్నీ తప్పుడు కథనాలని వికాస్‌ ఓసారి తనతో వాపోయాడని తెలిపారు. కాగా.. వికాస్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌)కు పనిచేస్తున్నట్లు బంధువులు భావిస్తున్నారు.

అరెస్టయ్యాడా? లేదా?

వికాస్ యాదవ్ ఎక్కడున్నాడు? దేంట్లో పనిచేస్తున్నాడు? అనేది ఓ సందిగ్ధంలో ఉండగా.. ఢిల్లీ రోహిణీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి 2023 డిసెంబరులో వికాస్‌ పై ఫిర్యాదు చేశాడు. అంతకు నెల రోజుల ముందు వికాస్ తో తనకు పరిచయం అయిందని.. హోటల్‌ కు పిలిచి దాడి చేసి దోపిడీకి ప్రయత్నించాడని ఆరిపించాడు. ఈ నేపథ్యంలో డిసెంబరు 18న వికాస్‌ తో పాటు అతడి అనుచరుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారని తెలిసింది. ఈ ఏడాది మార్చిలో వికాస్ పై ఛార్జి షీట్ కూడా దాఖలైంది. కానీ, ఏప్రిల్ లోనే వికాస్‌ కు బెయిల్‌ వచ్చిందని కథనాలు ప్రచురితం అయ్యాయి. దీంతోనే వికాస్ ఇంకా భారత్‌ లోనే ఉన్నాడని అమెరికా ఆరోపిస్తోంది. తమకు అప్పగించాలని త్వరలో కోరే చాన్సుంది. కాగా, 17 ఏళ్ల కిందటనే వికాస్ యాదవ్‌ తండ్రి చనిపోగా.. అతడి సోదరుడు హరియాణా పోలీస్‌ గా పనిచేస్తున్నాడు.

Tags:    

Similar News