371 కోట్ల కోసం అరెస్ట్ చేస్తారా... మోత్కుపల్లి వెర్షన్ పీక్స్!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మద్దతుగా తెలంగాణ నేతల నుంచి రియాక్షన్ వస్తోంది.

Update: 2023-09-23 09:25 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మద్దతుగా తెలంగాణ నేతల నుంచి రియాక్షన్ వస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొంతమంది బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు బాబు అరెస్టును ఖండించారు. అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఇదే సమయంలో తాజాగా మోత్కుపల్లి.. బాబు అరెస్ట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును.. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆరెస్స్ నేత, టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నరసింహులు స్పందించారు. ఈ సందర్భంగా మైకుల ముందుకు వచ్చిన ఆయన... పేదవర్గాలంతా ఏకమై జగన్ ను గెలిపించారని అన్నారు. అయితే ఆయన అధికారంలోకి వచ్చినప్పటినుంచీ మైకంలో ఉన్నారన్ని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రాజధాని లేని రాజ్యాన్ని ఏలుతున్న నియంత జగన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో భయబ్రాంతులకు గుర్తిచేస్తూ జగన్ రాజ్యమేలుతున్నారని అన్నారు. "74 ఏళ్ల చంద్రబాబు లాంటి పెద్దమనిషిని, దేశానికే నాయకుడిగా ఉన్నటువంటి నాయకుడిని, ఎన్డీయేలో నాడు కన్వీనర్ గా పనిచేసిన నాయకుడిని, వాజపేయి ప్రభుత్వంలో పెద్దమనిషిగా ఉన్న నాయకుడిని తీసుకపోయి జైల్లో పెడతారండీ" అని మోత్కుపల్లి నరసింహులు ప్రశ్నించారు.

చంద్రబాబుని ఇలా చేసి రాక్షసానంధం పొందుతున్నారా.. నీ రాజ్యం ఎల్లకాలం ఉంటుందా అని నేనడుగుతున్నా.. అంటూ ఫైరయ్యారు మోత్కుపల్లి. 2021 లో కేసు బుక్కైతే.. అందులోని వ్యక్తులంతా బెయిల్స్ పై బయట తిరుగూంటే.. ఎఫ్.ఐ.ఆర్. లో పేరు లేనటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం ఎంతవరకూ సమంజసం అని మోత్కుపల్లి ప్రశ్నించారు.

ఇదే సమయంలో గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా.. రాజ్యాంగానికి విరుద్ధంగా అరెస్ట్ జరిగిందని చెప్పుకొచ్చిన మోత్కుపల్లి... సుమారు ఏడెనిమిది లక్షల కోట్ల బడ్జెట్ ను హ్యాండిల్ చేసిన చంద్రబాబు ముస్టి 371 కోట్ల కోసం దిగజారతాడా అంటూ తనదైన లాజిక్ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు మోత్కుపల్లి.

ఇదే ఫ్లో కంటిన్యూ చేసిన ఆయన... మూడుసార్లు ముఖ్యమంత్రి, ఎన్నడూ ఏ ఆరోపణా రుజువుకానటువంటి పరిస్థితుల్లో బ్రతికి నాయకుడు అని తెలిపిన మోత్కుపల్లి... చంద్రబాబు ఎన్నడూ కక్ష సాధింపులు చర్యలకు దిగిన నాయకుడు కాదని.. క్రిమినల్ అంతకంటే కాదని.. కొంతమంది ఇబ్బంది పడితే పడిఉండొచ్చని చెప్పుకొచ్చారు.

ఇక ఈ నాలుగేళ్లు ఏమి చేశారని జగన్ సర్కార్ ని ప్రశ్నించిన మోత్కుపల్లి... ఎన్నికలు నాలుగు రోజులు ఉందనగా ఇలాంటి ఆలోచన చేయడ్దం ఏంటని అడిగారు. అనంతరం... చంద్రబాబు వయసుకు విలువిచ్చి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని జగన్ కు సూచించారు మోత్కుపల్లి నర్సింహులు.

ఇక జైల్లో దోమలు కుట్టి రిమాండ్ ఖైదీ ఒకరు చనిపోయారని ప్రస్థావించిన మోత్కుపల్లి... 73ఏళ్ల పెద్దాయన దోమలు కుట్టి చనిపోతున్నాయని జడ్జికి స్వయంగా చెప్పారని, ఆయన ఆరోగ్యం గురించి జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తూ... చంద్రబాబు చనిపోతే జగనే బాధ్యుడని ఘాటుగా స్పందించారు.

అనంతరం... చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఎన్టీఆర్ ఘాట్‌ లో నిరసన దీక్ష చేపడతానని.. అదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష చేస్తానని మోత్కుపల్లి తెలిపారు. ఇది రాజకీయాలకు అతీతంగా చేస్తున్న దీక్ష అని అన్నారు. ఇదే సమయలో జగన్ అరెస్టును ఖండిస్తే ప్రజాస్వామ్య వాదిగా మంచిపేరు వస్తుందని కోరుకుంటున్నట్లు కేసీఆర్ కు సూచించారు మోత్కుపల్లి.

Tags:    

Similar News