జగన్ తెచ్చిన 'దిశ' ఏ దశలో ఉంది? కేంద్రం సమాధానం ఇదే!
ఇక, తాజాగా ఈ విషయం పార్లమెంటులో చర్చకు వచ్చింది. వైసీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నిస్తూ.. వైసీపీ హయాంలో ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 'దిశ' బిల్లు ఏ స్థాయిలో ఉందని కేంద్ర హోం శాఖను ప్రశ్నించారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన 'దిశ' చట్టం ఏ దశలో ఉంది? దీనిపై తరచుగా రాజకీయ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఏపీ అసెంబ్లీలోనూ మహిళల భద్రత విషయం చర్చకు వచ్చినప్పుడు.. దిశ చట్టంపై.. కూటమి మంత్రులు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు లేని దిశ చట్టాన్ని అమలు చేయడం ఏంటి? అని కూడా ప్రశ్నించారు. దశ-దిశ లేని చట్టంగా దానిని తీసుకువచ్చారని, అందుకే కేంద్రం బుట్టదాఖలు చేసిందని మంత్రి అనిత విమర్శించారు.
ఇక, తాజాగా ఈ విషయం పార్లమెంటులో చర్చకు వచ్చింది. వైసీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నిస్తూ.. వైసీపీ హయాంలో ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 'దిశ' బిల్లు ఏ స్థాయిలో ఉందని కేంద్ర హోం శాఖను ప్రశ్నించారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ.. తీసుకువచ్చిన ఈ బిల్లును ఆమోదిస్తా రా? లేదా? అని ప్రశ్నించారు. దీనికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమాధానం ఇస్తూ.. దిశ బిల్లు -2019 ప్రస్తుతం రాష్ట్రపతి అనుమతి కోసం పంపించినట్టు చెప్పారు.
ఏపీ ప్రభుత్వం(వైసీపీ) పంపించిన ఈబిల్లును నోడల్ మంత్రిత్వ శాఖల పరిశీలన పూర్తయినట్టు తెలిపా రు. ఇప్పటికే ఈ బిల్లుపై మహిళా భద్రతా విభాగం, హోం శాఖ కూడా పలు సూచనలు, సలహాలు చేసిందని.. ప్రస్తుతం ఇది ఏపీ ప్రభుత్వ(కూటమి) పరిశీలనలో ఉందని సంజయ్ తెలిపారు. బిల్లులో మార్పు చేర్పులపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపినట్టు సంజయ్ వివరించారు.
ఇక, ఇప్పుడు.. రాష్ట్ర సర్కారు స్పందిస్తే.. తదుపరి చర్యలు తీసుకుంటామని.. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే.. వెంటనే చట్టంగా అమలు చేసుకోవచ్చని వివరించారు. అంటే.. మొత్తానికి దిశ బిల్లు అయితే సజీవం. అనుమతి రాకపోవడంతోనే ముందుకుసాగలేదన్న విషయం స్పష్టమైంది. ఇది ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చిందని.. కూటమి సర్కారు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని కేంద్ర మంత్రిగా బండి సంజయ్ వెల్లడించడం గమనార్హం.