జగన్‌ ఢిల్లీ పర్యటనలో కీలక ఎంపీ దూరం అందుకేనా?

జగన్‌ పర్యటన ముందు రోజు వరకు ఢిల్లీలోనే ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి... జగన్‌ ఢిల్లీకి వస్తున్న క్రమంలో విదేశాలకు వెళ్లిపోయారని టాక్‌ నడుస్తోంది.

Update: 2024-02-10 08:28 GMT

వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి తాజాగా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు తదితర అంశాలపై ఆయన మోదీకి విన్నవించారు.

కాగా జగన్‌ ఢిల్లీ పర్యటనలో ఎప్పటిమాదిరిగానే ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డే అంతా చూసుకున్నారు. జగన్‌ ప్రధానిని కలవడానికి పార్లమెంటుకు వచ్చారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డితోపాటు బాపట్ల ఎంపీ నందిగం సురేశ్, రాజమండ్రి ఎంపీ భరత్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ తదితరులు కనిపించారు కానీ కీలక ఎంపీ, వైసీపీకి ఆర్థికంగా ఇరుసులాంటి వ్యక్తి అయిన వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి కనిపించలేదు.

ఈ నేపథ్యంలో జగన్‌ పర్యటనలో వేమిరెడ్డి గైర్హాజరుపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. జగన్‌ పర్యటన ముందు రోజు వరకు ఢిల్లీలోనే ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి... జగన్‌ ఢిల్లీకి వస్తున్న క్రమంలో విదేశాలకు వెళ్లిపోయారని టాక్‌ నడుస్తోంది. ఢిల్లీలో ఉంటే జగన్‌ ను కలవాల్సి వస్తుందనే కారణంతోనే ఆయన చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారని అంటున్నారు. పార్టీ సీనియర్‌ లీడర్లకు కూడా వేమిరెడ్డి అందుబాటులో లేరని, ఆయన ఫోన్లు కూడా స్విచ్ఛాప్‌ చేసుకున్నారని చెబుతున్నారు.

ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఈసారి నెల్లూరు నుంచి లోక్‌ సభకు పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌ సభ నియోజకవర్గం పరిధిలో ఒకటి రెండు చోట్ల తాను చెప్పిన అభ్యర్థులకు సీట్లు ఇవ్వాలని వేమిరెడ్డి కోరారు. ముఖ్యంగా నెల్లూరు సిటీలో అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కు సీటు ఇవ్వవద్దని విన్నవించారు. ఈ నేపథ్యంలో అనిల్‌ ను నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి జగన్‌ బరిలో దించుతున్నారు.

నెల్లూరు సిటీ నుంచి తన భార్య ప్రశాంతికి లేదా తాను సూచించిన మరో వ్యక్తికి సీటు ఇవ్వాలని వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి కోరారు. అయితే నెల్లూరు సిటీ నుంచి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సన్నిహితుడైన డిప్యూటీ మేయర్‌ ఖలీల్‌ అహ్మద్‌ కు జగన్‌ సీటు ఇచ్చారు. దీంతో ఖలీల్‌ అహ్మద్‌.. అనిల్‌ తో కలిసి జగన్‌ వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపి వచ్చారు.

ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురయిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి అప్పటి నుంచి పార్టీ అధిష్టానంతో అంటీముట్టనట్టు ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఒక దశలో ఆయన నెల్లూరు ఎంపీ స్థానం నుంచి తప్పుకోవడానికి కూడా సిద్ధపడ్డారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటనకు కావాలనే వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి డుమ్మా కొట్టారనే గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. జగన్‌ ఢిల్లీ చేరుకునేసరికి ఆయన ఢిల్లీ నుంచి దుబాయ్‌ వెళ్లిపోయారని టాక్‌ నడుస్తోంది.

నెల్లూరు లోక్‌సభ స్థానంలో వైసీపీ తరఫున పోటీపైనా వేమిరెడ్డి పునరాలోచనలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. నెల్లూరు నగరంతో కావలి, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని గతంలో ఆయన కోరినా.. సీఎం సమ్మతించలేదని అంటున్నారు. దీంతో వేమిరెడ్డి తీవ్ర అంసతృప్తికి గురయ్యారని చెబుతున్నారు.


Tags:    

Similar News