ఈ లెక్క భలే సిత్రం బాస్.. ఎమ్మెల్యేలు 11.. ఎంపీలు 4
సార్వత్రిక ఎన్నికలు.. అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు.. ఓటరు వేయాల్సిన రెండు ఓట్లు ఒకే పార్టీకి వేయటం జరుగుతుంది.
ప్రతి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక లోక్ సభ స్థానం ఉండటం తెలిసిందే. రెండు రోజుల క్రితం వెలువడిన ఎన్నికల ఫలితాల్ని చూసినప్పుడు ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికలు.. అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు.. ఓటరు వేయాల్సిన రెండు ఓట్లు ఒకే పార్టీకి వేయటం జరుగుతుంది. అందుకే.. అసెంబ్లీకి వచ్చిన సీట్లకు దగ్గరగా ఎంపీ సీట్లు వచ్చేస్తుంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ఈ లెక్క కాస్తంత మారుతుంది. అయితే. ఈసారి మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందని చెప్పాలి.
ఏపీలో అధికార పార్టీగా ఎన్నికల బరిలోకి దిగిన వైసీపీకి వచ్చిన అసెంబ్లీ స్థానాలు అక్షరాల 11. అలాంటి వేళ.. రెండు ఎంపీ స్థానాలు దక్కాల్సి ఉంటుంది. కానీ.. అందుకు విరుద్ధంగా నాలుగు ఎంపీ స్థానాలు దక్కటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. దీనికి కారణం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. వైసీపీ గెలిచిన నాలుగు ఎంపీ స్థానాల్ని చూస్తే.. కడప.. రాజంపేట.. తిరుపతి.. అరకు. నిజానికి వైసీపీ గెలుచుకున్న ఈ నాలుగు ఎంపీ స్థానాల్లో.. అత్యధిక అసెంబ్లీ స్థానాల్ని టీడీపీ కూటమి గెలుచుకుంది.
కాకుంటే.. కూటమికి చెందిన ఎంపీ అభ్యర్థుల పోల్ మేనేజ్ మెంట్ తోపాటు ఆఖరినిమిషంలో బరిలోకి దిగటం వారిని ఓడిపోయేలా చేసింది. అదే సమయంలో ఎంపీ అభ్యర్థులుగా వైసీపీ నిలిపిన అభ్యర్థులు ఇప్పటికే పలుమార్లు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయటం.. వారికి క్షేత్రస్థాయిలో ఉన్న బలం కూడా ప్లస్ అయ్యింది. అదే సమయంలో కూటమి నేతల లోపాలు వారిని ఓడేలా చేశాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితులు కూడా అసెంబ్లీ స్థానాలతో పోలిస్తే ఎక్కువ ఎంపీ స్థానాల్ని వైసీపీ గెలుచుకున్న పరిస్థితి. కారణం..కూటమి ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఎవరికి వారిగా ఉన్న ప్రత్యేక కారణాలే తాజా ఫలితానికి కారణంగా చెప్పక తప్పదు.
ఉదాహరణకు కడప విషయాన్నే తీసుకుంటే.. అక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అవినాశ్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల నిలిచారు. కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన భూపేష్ రెడ్డి బరిలోకి నిలిచారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న షర్మిల టీడీపీ ఓటమికి కారణమయ్యారని చెప్పాలి. ఎందుకుంటే.. ఆమెకు వచ్చిన ఓట్లు 1,35,731. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి భూపేష్ కు వచ్చిన ఓట్లు 5,31,611. అంటే.. టీడీపీకి పడాల్సిన ఓట్లు షర్మిలకు పడ్డాయని చెప్పాలి. నిజానికి ఎన్నికల ముందు వరకు వైసీపీ ఓట్లు షర్మిలకు షిఫ్టు అవుతాయని భావించారు. అనూహ్యంగా అందుకు భిన్నంగా జరిగిన పరిస్థితి.
ఈ కారణంతోనే అవినాష్ రెడ్డి కాస్తపాటి మెజార్టీతో బయటపడ్డారు. 2019లో అవినాశ్ రెడ్డికి వచ్చిన ఓట్లతో పోలిస్తే.. తాజా ఎన్నికల్లో వచ్చిన మెజరా్టీ చాలా తక్కువ. కేవలం 65,490 ఓట్ల మెజార్టీని సొంతం చేసుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో అవినాశ్ కు వచ్చిన మెజార్టీ 3.80లక్షలు. ఆ లెక్కతో పోలిస్తే తాజా ఎన్నికల్లోఆయనకు వచ్చిన ఓట్లు చాలా తక్కువ. కాకుంటే.. షర్మిల ఫ్యాక్టర్ కూటమికి ఒక ఎంపీ సీటు దక్కకుండా చేసిందని చెప్పాలి.
అదే విధంగా రాజంపేటలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీటు కూడా వైసీపీకి సొంతమైంది. ఇక్కడ కూడా అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా ఇంకెవరైనా బరిలోకి నిలబడి ఉంటే ఫలితం వేరేలా ఉందన్న మాట వినిపిస్తోంది. తిరుపతిలోనూ అభ్యర్థి ఎంపిక చివర్లో జరగటం కూటమికి మైనస్ అయ్యిందని చెబుతున్నారు. ఇక.. అరకులోనూ కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి గీత బరిలోకి దిగారు. ఆమెకున్న వ్యక్తిగత ఇమేజ్ కూటమికి మైనస్ అయ్యింది. అదే సమయంలో వైసీపీకి ప్లస్ అయ్యిందని చెప్పాలి. ఒకవిధంగా చెప్పాలంటే ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ ఫలితాలు ఏర్పడినట్లుగా చెప్పాలి. ఈ వాదనకు బలం చేకూరేలా వైసీపీ అభ్యర్థులు సాధించిన మెజార్టీలేనని చెప్పాలి. గత ఎన్నికలతో పోలిస్తే.. తాజా ఎన్నికల్లో వారి మెజార్టీలు తగ్గటం చూస్తే.. వైసీపీ అభ్యర్థుల గొప్పతనం కంటే కూటమి చేసిన పొరపాట్లే వారిని గెలిచేలా చేశాయన్న మాట వినిపిస్తోంది.