123 ఏళ్ల తర్వాత అత్యంత వేడి అక్టోబరు నెల ఇదేనట

అక్టోబరు ముగిసింది. నవంబరులోకి అడుగు పెట్టేశాం. అయినప్పటికి చలి జాడ కనిపించని పరిస్థితి.

Update: 2024-11-02 05:30 GMT

అక్టోబరు ముగిసింది. నవంబరులోకి అడుగు పెట్టేశాం. అయినప్పటికి చలి జాడ కనిపించని పరిస్థితి. ఈ అసాధారణ తీరు అప్పుడెప్పుడో 123 ఏళ్ల క్రితం చోటు చేసుకోగా.. తాజాగా అలాంటి పరిస్థితే ఉందంటున్నారు వాతావరణ నిపుణుడు. తాజాగా దేశ వ్యాప్తంగా నెలకొన్న వాతావరణ పరిస్థితులపై దేశ రాజధాని ఢిల్లీలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మ్రత్యుంజయ మహాపాత్ర వివరించారు. దేశంలో అసాధారణ వాతవరణ పరిస్థితులు ఉన్నట్లుగా చెప్పిన ఆయన.. దానికి కారణాల్నివివరించే ప్రయత్నం చేశారు.

బంగాళాఖాతంలో తరచూ అల్పపీడనాలు చోటు చేసుకోవటం.. తూర్పు గాలుల ప్రభావం.. పశ్చిమ దిశ నుంచి ఎలాంటి అవాంతరాలు లేకపోవటం లాంటి కారణాలతో దేశ వ్యాప్తంగా వాతావరణం వెచ్చగా ఉంటోందన్నారు. అంతేకాదు.. 1901 తరవాత ఈ ఏడాది అక్టోబరు నెల అత్యంత వేడి నెలగా అభివర్ణించారు. సాధారణం కంటే 1.23 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైనట్లు పేర్కొన్నారు.

అక్టోబరులో సరాసరి ఉష్ణోగ్రత 21.85 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. వాస్తవానికి ఇది ఉండాల్సింది 20.01 డిగ్రీల సెల్సియస్. ఈ నేపథ్యంలో నవంబరులోనూ ఉష్ణోగ్రతలు ఉండకపోవచ్చన్న అంచనాలో ఐఎండీ ఉంది. అంతేకాదు.. నవంబరు అన్నంతనే చలి గజగజ ఒకస్థాయికి చేరుకోవాల్సి ఉంటుంది. కానీ.. అలాంటిదేమీ కనిపించట్లేదని చెబుతున్నారు. డిసెంబరుతో మొదలయ్యే చలి.. జనవరి, ఫిబ్రవరిలో కొనసాగుతుందని చెబుతున్నారు. నవంబరులో దక్షిణ భారతంలో రుతపవనాల తిరోగమన వేళ.. సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ నెల (నవంబరు)లో చలి ఉండదన్న విషయాన్ని ఐఎండీ చెబుతోంది.

Tags:    

Similar News