ఆకలి చావులను మాపిన ఆ శాస్త్రవేత్త.. అనంత లోకాలకు
ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ గురించి ఇదంతా. ఆయన గురువారం చెన్నైలో కన్నుమూశారు.
కేవలం 18 ఏళ్ల వయసులో.. తమ రాష్ట్రం కాని రాష్ట్రంలో వచ్చిన కరువును చూసి చలించిపోయి వ్యవసాయ శాస్త్రవేత్తగా మారి.. ఆకలి చావులను మాపిన ఓ గొప్ప వ్యక్తి తన శకం చాలించారు. 98 ఏళ్ల జీవితంలో అత్యధిక కాలాన్ని కరువును పారదోలేందుకే వెచ్చించిన మహా మనీషి మన మధ్య నుంచి వెళ్లిపోయారు. పేద భారతీయుల నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్లేలా చేసిన ధన్య జీవి తనువు చాలించారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ గురించి ఇదంతా. ఆయన గురువారం చెన్నైలో కన్నుమూశారు.
పర్యావరణ హాని లేకుండా..స్వామినాథన్ అంటే సాధారణ వ్యక్తి కాదు. ఆయన భారత హరిత విప్లవ పితామహుడు. 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో పుట్టిన ఆయన ప్రఖ్యాత శాస్త్రవేత్తగా దిగారు. తండ్రి ఎంకే సాంబశివన్ వైద్యుడు కావడంతో ఆయన బాటలోనే మెడికల్ కాలేజీలో చేరారు.
అయితే, 1943లో బెంగాల్ లో వచ్చిన డొక్కల కరువును చూసి చలించిపోయిన ఆయన దేశాన్ని ఆకలి బాధల నుంచి బయటపడేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. అలా.. డాక్టర్ చదువును వదిలి వ్యవసాయ పరిశోధకుడిగా మారారు. తివేండ్రంలోని మహారాజా కళాశాల నుంచి జువాలజీ డిగ్రీ పూర్తిచేశారు.మద్రాస్ వ్యవసాయ కళాళాలలో, ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో పీజీ చేశారు.
ఐపీఎస్ నూ వదులుకుని..ఎంబీబీఎస్ ను వదిలి అగ్రి స్టడీస్ వైపు వచ్చిన స్వామినాథన్.. పీజీ తర్వాత సివిల్స్ రాసి ఐపీఎస్ కూడా సాధించారు. దానినీ వదులుకుని యునెస్కో ఫెల్ షిప్ పొంది నెదర్లాండ్స్ లోని అగ్రికల్చర్ వర్సిటీ చేరారు. ఆలుగడ్డల జన్యుపరివర్తనంపై అధ్యయనం చేశారు. ప్రఖ్యాత కేంబ్రిడ్జి నుంచి పీహెచ్ డీ కూడా పూర్తి చేశారు.
1954లో భారత్ కు తిరగొచ్చి తాను చదివిన భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్తగా చేరారు. 1972-79 మధ్య ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ డీజీగా పనిచేశారు. 1979లో కేంద్ర వ్యవసాయ శాఖకు ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు.
కరువును చూసి కలత చెంది..1960ల్లో భారత్ ను కరువు పీడించింది. ఆ సమయంలో మెక్సికో శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్ ను భారత్ కు రప్పించి వ్యవసాయ విప్లవానికి ఆద్యుడయ్యారు స్వామినాథన్. అలా హరిత విప్లవానికి పునాది వేశారు. పంజాబ్ లో ప్రస్తుతం గోధుమ పంట విపరీతంగా పండుతోంది అంటే దీనికి కారణం స్వామినాథనే. అయితే, 1960ల్లో ప్రభుత్వం నుంచి అనుమతుల పరంగా ఇబ్బందులు అధికంగా ఉండేవి.
వీటిని అధిగమించి మెక్సికో ల్యాబ్ ల నుంచి గోధుమలను దిగుమతి చేసుకుని పంజాబ్ లో పండించారు స్వామినాథన్. అలా భారత హరిత విప్లవానికి పితామహుడిగా నిలిచారు. స్వామినాథన్ కు 1971లో రామన్ మెగసెసె, 1989 లో పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి. పద్మశ్రీ, పద్మ భూషణ్ కూడా పొందిన ఘనత ఆయన సొంతం. 2007-13 మధ్య రాజ్యసభ ఎంపిగా వ్యవహరించారు.
సౌమ్య ఈయన కుమార్తెనే.. స్వామినాథన్ కుమార్తె సౌమ్య స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో)లో పనిచేస్తున్నారు. కొవిడ్ సమయంలో ఆమె చీఫ్ సైంటిస్ట్ కావడం గమనార్హం. అప్పట్లో సౌమ్య స్వామినాథన్ చెప్పే విషయాలు కొవిడ్ పై అప్రమత్తంగా ఉండేందుకు ఉపయోగపడ్డాయి.