ఆ ట్యాగ్ తో ముద్రగడ ... జీర్ణించుకోలేకపోతున్నారా ?
తాను అన్న మాటకు కట్టుబడడం ఆయనకు అలవాటు కాబట్టి ఆయన ఆ విధంగా చేశారు. నిజానికి రాజకీయాల్లో ఎంతో మంది సవాళ్ళు చేస్తారు.;

ముద్రగడ పద్మనాభం 1978 లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన తండ్రి కూడా అప్పటికి అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అలా రాజకీయ కుటుంబంగా పేరు ఉన్న ముద్రగడ తనకు ఉన్న సీనియారిటీకి ఈ పాటికి ఏపీలో అత్యున్నత పదవిలో ఉండాలి. కానీ ఆయనకు ఆవేశం హెచ్చు అని చెబుతారు.
అదే సమయంలో ఆయన ఆత్మ గౌరవానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. తాను ఒక్క మాట పడరు. అలాంటి వారికి రాజకీయాలు కష్టమే అయినా ముద్రగడ అందులో కొనసాగుతూ వచ్చారు. అయితే సక్సెస్ ఫుల్ గా చేస్తూ పదవులను అందుకోలేకపోయారు.
ఇదిలా ఉంటే ఆయన వైసీపీలో చేరాక పిఠాపురంలో జనసేన అధినేత పవన్ ని ఓడించేందుకు ఆ పార్టీ తరఫున పనిచేశారు. ఆ సమయంలో పిఠాపురం తనకు బలమున్న ప్రాంతమని భావించి ఉన్నారు. అందుకే ఆ ధీమాతో పవన్ ఓటమి ఖాయమని ప్రకటించేశారు.
అంతే కాదు పవన్ ని ఓడిస్తాను లేకపోతే నా పేరు ఇక పద్మనాభరెడ్డి అని కూడా సంచలన ప్రకటన చేశారు. నిజానికి ఈ సవాల్ ఆయనకు ఆయనే చేసి స్వీకరించారు. ఆయన ఈ విధంగా అన్నప్పటికీ జనసేన నుంచి కానీ కూటమి వైపు నుంచి కానీ ఎవరూ ఆయన్ని అలా చేయమని కోరలేదు కూడా.
ఇక కూటమి ప్రభంజనంలో పవన్ డెబ్బై వేల ఓట్ల భారీ మెజారిటీతో పిఠాపురంలో గెలిచిన సంగతి విధితమే. ఆ విధంగా పవన్ గెలవడమేంటి ముద్రగడ తన సవాల్ ని తానే గుర్తు చేసుకుని ఇక నుంచి తాను పద్మనాభరెడ్డి అని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించుకున్నారు. అలా అధికారికంగా ఏడు పదుల వయసులో ఆయన ఒంటి పేరుని మార్చేసుకున్నారు.
తాను అన్న మాటకు కట్టుబడడం ఆయనకు అలవాటు కాబట్టి ఆయన ఆ విధంగా చేశారు. నిజానికి రాజకీయాల్లో ఎంతో మంది సవాళ్ళు చేస్తారు. కానీ తీరా ఆచరణలోకి వచ్చేసరికి నాలుక మడత వేస్తారు. తమ సవాల్ కి అవతల వారు సరే అని చెప్పలేదని ఏవో కుంటి సాకులు చెబుతారు. కానీ ముద్రగడ మాత్రం తాను అన్నాను కాబట్టి చేస్తాను అని ఒంటి పేరు చివరన రెడ్డి ట్యాగ్ ని తగిలించుకున్నారు.
తాజాగా ఆయన జగన్ కి రాసిన ఆత్మీయ లేఖలో కూడా ముద్రగడ పద్మనాభరెడ్డి అని రాసి సంతకం పెట్టారు. దీనిని గోదావరి జిల్లాలలో ఉన్న కాపు సామాజిక వర్గం నాయకులు ప్రజలు ఆయన అనుచరులు సైతం సహించలేకపోతున్నారుట. కాపుల కోసం జీవిత పర్యంతం పనిచేసి వారి కోసం రాజకీయంగా తన పదవులను సైతం వదులుకుని నిలబడిన ముద్రగడ సొంత కులాన్ని పక్కన పెట్టి మరీ రెడ్డి ట్యాగ్ తగిలించుకోవడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏదో ఆవేశంలో ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత పేరు మార్చుకున్నా ఈ పది నెలల కాలంలో కూడా ఇదే విధంగా వ్యవహరించడం ఆయన తీరులో మార్పు రాలేదనడానికి నిదర్శనం అని అంటున్నారు. దాంతో పెద్దాయన ఇక ఆ ట్యాగ్ తోనే జీవితాంతం ఉంటారా అని అంతా అనుకుంటున్నారు.
ముద్రగడ ఈ విధంగా ఆవేశంతో తీసుకున్న తన నిర్ణయంతో బలమైన సామాజిక వర్గానికి అసంతృప్తిని కలిగించారు అని అంటున్నారు. ఏది ఏమైనా ఆయనకు ఇప్పటికి గోదావరి జిల్లాలలో బలం ఉంది. ఆయన అంటే పడి చచ్చే వారు ఉన్నారు. ఆరాధించేవారు ఉన్నారు. మరి ముద్రగడ బహుశా 2029 ఎన్నికల్లో వైసీపీని గెలిపించిన మీదట తన పేరుని పూర్వం మాదిరిగా మార్చుకుంటారా అన్న చర్చ కూడా ఉందిట.