ముద్రగడని వదిలి పవన్ చెంతకు

గోదావరి జిల్లాలో మారుమోగిన పేరు ఎవరిది అంటే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానిది. ఆయన 1978లోనే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు

Update: 2024-09-30 04:01 GMT

గోదావరి జిల్లాలో మారుమోగిన పేరు ఎవరిది అంటే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానిది. ఆయన 1978లోనే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అంటే చంద్రబాబు వైఎస్సార్ సమకాలీనుడు.ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేశారు. ఇక కాంగ్రెస్ లోనూ పనిచేశారు.

ఆయన ఎక్కడ ఉన్నా ఏమి చేసినా ఆయన వెంట కాపులు ఉండేవారు. వారంతా ఆయనను అట్టిపెట్టుకునే కొనసాగేవారు. దాంతో ముద్రగడ రాజకీయం గోదావరి మీద నావలాగా సాఫీగా సాగేది. ఏ ఎదురీతకు గురి కాలేదు. కానీ ముద్రగడకు అసలైన పోటీ ఎక్కడ వచ్చింది అంటే పవన్ తోనే. ఆయన 2014లో జనసేన ఏర్పాటు చేశారు.

ఆ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచారు. ఇక ముద్రగడ టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆ పార్టీ మీదనే కాపుల కోసం పోరాటం చేశారు. బీసీలలో చేర్చాలని దీక్షలూ చేశారు. 2019లో టీడీపీ చంద్రబాబు పవన్ ఓటమి పాలు అయ్యారు. దాంతో పాటు వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ అయిదేళ్ళూ జగన్ ని కాపుల రిజర్వేషన్ విషయంలో ముద్రగడ ఏ విధంగానూ ఒత్తిడి చేయలేదు.

దాంతో ముద్రగడ మీద కాపులు మెల్లగా అసంతృప్తి పెంచుకున్నారు. ఆ తరువాత చూస్తే 2024 నాటి రాజకీయ సమీకరణలను ముద్రగడ మొదట్లో కరెక్ట్ గానే అంచనా వేసి జనసేనలో చేరాలని అనుకున్నా పవన్ తన ఇంటికి రాలేదని అలిగి జగన్ వైపు మళ్లారు. అలా ఆయన చేసిన మరో తప్పుగా చెబుతున్నారు

ఈ మధ్యలో పవన్ మీద ముద్రగడ విమర్శలు చేయడం కూడా కాపులకు నచ్చలేదు అని అంటున్నారు. కాపులకు తమలో ఒకరు ఏదో నాటికి సీఎం కావాలని కోరిక ఉంది. అది ముద్రగడతో అవుతుందని చాలా కాలం ఆయన వెంట నడిచారు. ఇపుడు ముద్రగడ పూర్తిగా రాజకీయ వ్యూహాలు లేక చతికిలపడిన నేపథ్యం ఉంది.

అదే సమయంలో పవన్ కళ్యాణ్ ముల్లుని ముల్లుతోనే తీయాలన్న సూత్రంతో వైసీపీని ఓడించి టీడీపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇపుడు వైసీపీ ఎలిమినేట్ అయితే ఆ ప్లేస్ లోకి జనసేన వెళ్తుందని చూస్తున్నారు. ఇలా పవన్ రాజకీయం రాటు దేలుతున్న వేళ కాపులు అంతా జనసేనలో చేరుతున్నారు

దాంతో ముద్రగడ వెంట ఎవరు నిఖార్సుగా ఉన్నారు అన్నది కూడా చర్చగా ఉంది. ముద్రగడ చూస్తే దాదాపుగా ఏడు పదుల వయసుకు చేరువలోకి వచ్చేశారు. ఆయన వైసీపీలో ఉన్నారంటే ఉన్నారు ఇటీవల జగన్ పిఠాపురం పర్యటనకు వచ్చినా ఆయనను కలవలేదు.

దాంతో ముద్రగడ రాజకీయాల నుంచి తప్పుకున్నట్లేనా అన్న చర్చ సాగుతోంది. కాపులలో నవతరం ఇపుడు పవన్ వెంట నడుస్తోంది. దాంతో సామాజికంగా ఒకనాడు బలంగా కనిపించిన ముద్రగడ ఇపుడు ఏమీ కాకుండా అయ్యారు అన్న ప్రచారమూ ఉంది.

వైసీపీ చూస్తే ఘోరంగా ఓటమితో ఉంది. అయిదేళ్ల పాటు ఆ పార్టీ నుంచి పోరాటం తప్ప అవకాశాలు లేవు. దాంతో ముద్రగడ వాయిస్ ఎక్కడా వినిపించడం లేదని అంటున్నారు. వైసీపీ కూడా కాపులను ముద్రగడ ఎంతో కొంత ఆకర్షించగలరని అనుకుంది. కానీ పవన్ కళ్యాన్ చర్మిషాతో ఆయన వెనకబడిపోయారని ఆలోచిస్తోంది.

ఇలా చూస్తే కనుక గోదావరి జిల్లాలో కాపులు అంతా జనసేన వైపుగా ర్యాలీ అవుతున్నారు. రాజకీయల్లో పట్టు విడుపులు తెలియని ముద్రగడ మంచి వారుగా పేరు అయితే తెచ్చుకున్నారు కానీ రాజకీయంగా ఎదగలేకపోయారు అని అంటారు. అదే విధంగా కాపులు కూడా ఇపుడు తమ ఆలోచనలు మార్చుకుని పవన్ కి జై అంటున్న నేపధ్యంతో పెద్దాయన ఇక తెర మరుగేనా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది.

Tags:    

Similar News