అన్నంత పనిచేసిన ముద్రగడ!
ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్‌ను ఇక్కడి ప్రజలు ఆదరించారు.
సీనియర్ రాజకీయ నాయకుడు, వైసీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నంత పని చేశారు. మే 13న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడిస్తానని.. ఆయన చెప్పారు. ఇలా కనుక చేయక పోతే.. తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు. అయితే.. ఈ నెల 4న వచ్చిన ఎన్నికల ఫలితాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. 70 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్‌ను ఇక్కడి ప్రజలు ఆదరించారు. ఈ నేపథ్యంలో వైసీపీ తరఫున పోటీ చేసిన వంగా గీత పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలో ముద్రగడ తన శపథాన్ని నెరవేర్చుకున్నారు. తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకునేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేశానని అప్పట్లోనే ఆయన చెప్పారు. తాజాగా ప్రభుత్వం ఆయన పేరును మారుస్తూ.. గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
అయితే.. రాజకీయాల్లో ఎంతో మంది శపథకాలు చేస్తుంటారు. ఉదాహరణకు నరసరావు పేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ టికెట్ పై పోటీ చేశారు. ఆ సమయంలో ఆయన తాను ఓడిపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. కానీ, ఆయన ఓడిపోయినా.. తన శపథం నిలబెట్టుకోలేదు. పైగా.. ఎవరూ తనశపథాన్ని స్వీకరించలేదని.. ఎందుకు రాజకీయాలు వదిలేయాలని ప్రశ్నించారు.
ఇక, గుడివాడ నుంచి వరుసగా ఐదో సారి పోటీ చేసిన ఫైర్‌బ్రాండ్ వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని కూడా.. తను ఓడిపోయి.. చంద్రబాబు గెలిస్తే.. ఆయన దగ్గర కూర్చుని బూట్ పాలిష్ చేస్తూ.. జీవితాన్ని గడిపేస్తానని శపథం చేశారు. అయితే.. తాజా ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. కానీ, అప్పటి నుంచి ఆయన మీడియా ముందుకు వచ్చినా.. తనశపథం విషయాన్ని పట్టించుకోలేదు. అయితే.. ముద్రగడ మాత్రం.. తన పేరును మార్చుకోవడం విశేషం. ఏదేమైనా .. రాజకీయాల్లో నాయకులు.. ఆచి తూచి వ్యవహరించాలనే సందేశాన్ని ఈ పరిణామం సూచిస్తుండడం గమనార్హం.