వైసీపీకి భారీ మైనస్ గా మారిన ముద్రగడ?
బాధ్యతను అప్పగించినప్పుడు జాగ్రత్తగా దాన్ని నిర్వర్తించాలి. అంతే తప్పించి అత్యుత్సాహానికి గురైతే మొదటికే మోసం వస్తుంది.
బాధ్యతను అప్పగించినప్పుడు జాగ్రత్తగా దాన్ని నిర్వర్తించాలి. అంతే తప్పించి అత్యుత్సాహానికి గురైతే మొదటికే మోసం వస్తుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం పరిస్థితి ఇదే తీరులో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కులం.. కులం అంటూ కులాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ రాజకీయాలు చేసేందుకు తెగ ఆసక్తిని ప్రదర్శించే ముద్రగడ.. అన్నీగీతల్ని చెరిపేస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.
మరోవైపు.. ముద్రగడ విషయంలో పవన్ ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మొన్నటికి మొన్న ముద్రగడ కుమార్తె.. అల్లుడు పార్టీలో చేరేందుకు వచ్చినప్పుడు సున్నితంగా వారించటం.. తర్వాతి రోజుల్లో వారిని పార్టీలో చేర్చుకుంటామని చెప్పటమే కాదు.. ఆ సందర్భంగా ముద్రగడ మీద పల్లెత్తు మాట అనకుండా అంతులేని సహనాన్ని ప్రదర్శించారు. ఆయన పెద్దరికాన్ని ప్రస్తావిస్తూ ఆయనపై తనకున్న గౌరవాభిమానాల్ని ప్రదర్శించారు. ఆయన్ను ఇంటికి వెళ్లి మరీ కలుస్తానని చెప్పిన పవన్.. ఆయన తనను అనే మాటల్ని తాను పెద్దగా తీసుకోనంటూ.. ఇంట్లో పెద్దోళ్లు ఒక మాట అంటే భరించలేమా? అంటూ ఆయన మీద తనకున్న అభిమానాన్ని ప్రదర్శించారు.
ముద్రగడతో పోలిస్తే పవన్ వయసులోనే కాదు.. రాజకీయ అనుభవంలోనూ చిన్నోడు. అయినప్పటికీ.. ముద్రగడతో పోలిస్తే మరెంతో విశాల హ్రదయంతో ఆలోచిస్తానన్నట్లుగా పవన్ తీరు ఉంటోంది. తాను పవన్ ను ఎన్నేసి మాటలు అంటున్నా.. తన విషయంలో ఏ మాత్రం తొందరపాటుకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పవన్ తీరును పట్టించుకోకుండా మరింత ఆగ్రహాన్ని ఆయనపై ప్రదర్శిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనకు ప్రతికూలంగా మారతాయంటున్నారు. కులం ఓట్లను టార్గెట్ చేసే క్రమంలో తాను మాత్రమే కాపులకు పెద్దగా తనను తాను ఊహించుకుంటున్న ముద్రగడ.. మిగిలిన వారి మనోభావాల్ని పట్టించుకోకుండా పవన్ ను ఉద్దేశిస్తూ చేస్తున్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ముద్రగడ నోటికి తాళం వేయాల్సిందిగా కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు అభిప్రాయ పడుతున్నారు. ముద్రగడ వ్యాఖ్యలపై రాజకీయంగా పెను దుమారంగా మారటం.. పవన్ కు సానుకూలంగా మారుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా ముద్రగడ మాటల దూకుడుకు బ్రేకులు వేయకుంటే మొదటికే మోసం రావటం ఖాయమంటున్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు ఏ మాత్రం మంచివి కావు. కానీ.. ఆ విషయాన్ని పక్కన పెట్టేసిన ముద్రగడ ఇప్పటివరకు ఆయన్ను మాత్రమే టార్గెట్ చేసేవారు. ఇప్పుడు పవన్ తల్లిదండ్రుల్ని సైతం నోటికి వచ్చినట్లుగా మాట్లాడటమే కాదు.. స్వచ్ఛమైన కాపులం అంటూ చేస్తున్న వ్యాఖ్యలు వికారంగా మారాయంటున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళలో.. ముద్రగడ మాటల హోరు అధికార పార్టీకి నష్టం చేకూరుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో వైసీపీ అలెర్టు కావటం మంచిదంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.