వైసీపీలోకి చేరికలు...ఫ్యాన్ స్పీడ్ గా తిరుగుతోందా ?

ఆయన పేరు ముదునూరి మురళీ క్రిష్ణం రాజు ఆయన కూటమికి బై బై చెబుతూ వైసీపీలో చేరి జగన్ చేత కండువా కప్పించుకున్నారు.

Update: 2024-10-18 03:15 GMT

వైసీపీ నుంచి బయటకు వెళ్ళే వారే కానీ వచ్చే వారు అయితే ఇపుడు ఎవరూ కనిపించడం లేదు. ఎందుకంటే వైసీపీ దారుణంగా ఓడిన పార్టీ కాబట్టి. ఇక టీడీపీ కూటమి బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దాంతో కూటమిలో ఉంటేనే మేలు అని అంతా అనుకుంటారు. అయిదేళ్ల పాటు అధికార పార్టీతో ఉంటే 2029 ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితుల బట్టి చూసుకోవచ్చు అన్న బాపతే ఎక్కువ.

దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలి అన్నదే కదా విధానం. అలా వైసీపీకి చాలా మంది నేతలు వెళ్ళిపోతున్నారు. వారిలో పార్టీ పునాదుల నుంచి ఉన్న వారు వైఎస్సార్ జగన్ అండతో పైకి వచ్చిన వారు, వైసీపీ బ్రాండ్ తోనే ఎదిగిన వారు కూడా గేటు దాటేసి పోతున్నారు.

ముఖ్యంగా గోదావరి జిల్లాలలో ఈ జంపింగ్స్ తో వైసీపీ అతలాకుతలం అవుతోంది. అటువంటి వేళ వైసీపీకి ఆశా కిరణంగా ఒక కీలక నేత గోదావరి జిల్లాలలో కూటమి నుంచి ఇటు వైపు వచ్చారు. దాంతో వైసీపీకి మళ్ళీ గెలిచేసినంత సంబరం వచ్చేసింది. ఆయన చేరికను చాలా గొప్పగా చెప్పుకునే పరిస్థితి కూడా ఉంది.

ఆయన పేరు ముదునూరి మురళీ క్రిష్ణం రాజు ఆయన కూటమికి బై బై చెబుతూ వైసీపీలో చేరి జగన్ చేత కండువా కప్పించుకున్నారు. ఆయనను స్వయంగా వెంటబెట్టుకుని వచ్చింది మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్. కాకినాడ జిల్లాలో రాజు కీలక నేతగా టీడీపీలో ఉన్నారు.

ఇక ఆయన విషయం ఏంటి అంటే 2023 ఏప్రిల్ అంటే ఇప్పటికి ఏణ్ణర్ధం క్రితం వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరారు. అప్పుడు కూడా ఆయన అధికార పార్టీ నుంచే బయటకు వచ్చారు. అయితే టీడీపీ ఆయనను ఆదరించి రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది. అంతే కాదు అమలాపురం టీడీపీ పరిశీలకునిగా కూడా ఎంపిక చేసింది.

అయితే ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి ఆయన సొంత నియోజకవర్గం ప్రత్తిపాడులో విభేదాలు మొదలు అయ్యాయి. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పరుపుల సూర్యప్రభ కూటమి తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎన్నికల్లో ఆమె గెలుపునకు రాజు పనిచేయలేదని కూటమి నేతలు ఆరోపించారు, దీని మీద హై కమాండ్ కి ఫిర్యాదు చేశారు కూడా.

ఆయన టీడీపీలో ఉన్నా వైసీపీ వారి కోసమే పనిచేశారు అని కూడా తీవ్ర విమర్శలు టీడీపీ తమ్ముళ్ళే చేశారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా తమ్ముళ్ళు కోరుతున్నారు. ఈ వ్యవహారం ఇలా ఉండగానే రాజు అక్కడ నుంచి తప్పుకుని తిరిగి సొంత గూటికి చేరుకున్నారు అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే ఈ సమయంలో వైసీపీలో రాజు చేరడం అంటే ఫ్యాన్ పార్టీకి బూస్టింగ్ వచ్చినట్లే అంటున్నారు. తెల్లారి లేస్తే వైసీపీ నుంచి వారు వెళ్ళిపోయారు, వీరు జంప్ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో చూస్త్రే అవే వైరల్ అవుతున్నాయి.

ఈ కీలకమైన సమయంలో వైసీపీలోకి కూడా నేతలు వస్తున్నారు ఆ పార్టీకి కూడా రేపటి రోజు ఉంది అని చెప్పేలా రాజు కండువా కప్పుకున్న కార్యక్రమం ఉంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే టీడీపీ కూటమి ఏర్పడిన నాలుగు నెలలలోనే ఒక కీలక నేత ఆ పార్టీకి వీడి ప్రతిపక్షంలోకి రావడం కొంత ఇబ్బందిగానే చూడాలని అంటున్నారు.

ఇక చాలా మంది తమ వైపు తిరిగి వస్తారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. వైసీపీని వీడి టీడీపీ జనసేనలలో ఇప్పటికే చేరిన వారు కూడా అక్కడ ఏ మాత్రం సుఖంగా లేరని వారికి మళ్లీ ఫ్యాన్ నీడలోనే కులాసా అని అంటున్నారు. అయితే అలా వెనక్కి వచ్చే వారిలో పార్టీకి మేలు చేసే వారినే తీసుకుంటామని అంటున్నారు. మొత్తానికి రాజుని తీసుకోవడం ద్వారా వైసీపీ కూటమికి షాక్ ఇచ్చింది అని అంటున్నారు. చూడాలి మరి వైసీపీలోకి చేరే వారు ఫ్యూచర్ లో ఎంత మంది ఉంటారో. ఆ లిస్ట్ ఎంత పొడవు ఉంటుందో. వైసీపీ ఫ్యాన్ మళ్లీ స్పీడ్ గా ఎలా తిరుగుతుందో అన్నది.

Tags:    

Similar News