బంగ్లాదేశ్ తాట తీయకుండా ఆగుతున్నారేం మోడీ?

తాజాగా చైనా పర్యటనలో ఉన్న యూనుస్ ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-04-02 04:26 GMT
బంగ్లాదేశ్ తాట తీయకుండా ఆగుతున్నారేం మోడీ?

ఏ దేశ స్వతంత్రం కోసం భారత్ తపించిందో.. అక్కడ జరుగుతున్న మారణహోమానికి చెక్ పెట్టి.. వారికి స్వేచ్చను స్వాతంత్ర్యాన్ని అందించామో.. ఇప్పుడు అదే గడ్డకు చెందిన తాత్కాలిక ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైనం చూసినప్పుడు ఒళ్లు మండక మానదు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనుస్ వ్యవహరిస్తున్న తీరు అంతకంతకూ తీవ్రంగా మారుతోంది. ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు పార్టీలకు అతీతంగా పలువురు నేతలు తప్పు పడుతుంటే.. మోడీ సర్కారు మాత్రం మౌనంగా ఉండటం.. ఆయన తాట తీసేలా బదులు ఇచ్చే విషయంలో వెనకుడుగులో ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసి తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి రావటానికి కాస్త ముందు నుంచి భారత్ మీద బంగ్లాదేశ్ ప్రజల్లో విషాన్ని నింపే శక్తులు ఎక్కువ అయ్యాయి. తాత్కాలిక ప్రభుత్వంలో అది మరింత ఎక్కువైంది. తాజాగా చైనా పర్యటనలో ఉన్న యూనుస్ ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెవన్ సిస్టర్స్ గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదని.. సముద్ర తీరమున్న బంగ్లాదేశ్ ఒక రకంగా ఈ ఏడు రాష్ట్రాలకు సాగర రక్షకుడిగా ఉందన్నారు.

ఈ ప్రాంతానికి సముద్రమార్గం లేకపోవటం చైనాకు ఒక సువర్ణ అవకాశంగా అభివర్ణిస్తూ.. ఈ ప్రాంతం పై చైనా తన ఆర్థిక సత్తాను చాటొచ్చని.. ఇక్కడ విస్తరించి.. ఉత్పత్తులు తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చన్నారు. ఈ వ్యాఖ్యలపై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే కాదు.. వివిధ రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యల్లో ముఖ్యమైన ఒక వ్యాఖ్య చేశారు త్రిపురకు చెందిన తిప్రా మోతా పార్టీ చీఫ్.. రాజవంశీకుడు ప్రద్యోత్ దేబర్మా మాణిక్య ఘాటు వ్యాఖ్య చేశారు.

‘1947 బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ నైకాశ్రయం మన చేతికి వచ్చినా వదిలేసుకోవటం అప్పట్లో చేసిన పెద్ద తప్పు’ అని పేర్కొన్నారు. అస్సాం జాతీయ పరిషత్ అధ్యక్షుడు జొర్హాట్ ఎంపీ లురిన్ జయోతి గొగోయ్ స్పందిస్తూ.. ‘ఏ దేశం విమోచన కోసం భారత్ పోరాడిందో ఇప్పుడు అదే దేశం శత్రుదేశంతో చేతులు కలపటం దారుణం. మన విదేశాంగ విధానం ఈ స్థాయికి దిగజారటం శోచనీయం’ అని వ్యాఖ్యానించారు. అంతకంతకూ చెలరేగిపోతున్న బంగ్లాదేశ్ పాలకులకు సరైన రీతిలో సమాధానం ఇచ్చే విషయంలో మోడీ సర్కారు చేస్తున్న జాగుపై పలువురు తప్పు పడుతున్నారు. ఈ మౌనం ఏమిటి మోడీ? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News