సంచలనం.. హసీనాపై కుట్ర.. బైడెన్ ఎదుటే ఒప్పుకొన్న యూనస్

సరిగ్గా రెండు నెలల కిందటి వరకు బంగ్లాదేశ్ లో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి.

Update: 2024-09-26 19:30 GMT

సరిగ్గా రెండు నెలల కిందటి వరకు బంగ్లాదేశ్ లో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి. జనవరిలో అధికారంలోకి వచ్చిన షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వంపై విమర్శలు తప్ప పెద్దగా వ్యతిరేకత లేదు. కానీ, జూలై చివరి వారం ఆగస్టు తొలి వారంలో ఏం జరిగిందో ఏమో కానీ.. రిజర్వేషన్ల మాటున ఆందోళనలు పెట్రేగాయి. ఉద్యమకారులు వీధుల్లోకి వచ్చారు. తొలుత శాంతించినట్లే శాంతించి.. వారం వ్యవధిలో మళ్లీ చెలరేగారు. దీంతో షేక్ హసీనా స్వదేశం వీడి హుటాహుటిన భారత దేశం వచ్చారు. చెల్లెలు రెహానాతో కలిసి అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నారు. ఆమెను తిరిగి పంపించే ప్రయత్నాలపై భారత్ ను కోరుతున్నా స్పందించడం లేదంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం వాపోతోంది.

ప్లాన్ ప్రకారమే..

బంగ్లా ప్రధానిగా ఉన్న హసీనాను ఓ ద్వీపంలో స్థావరం కోసం అమెరికా కోరిందని.. ఆమె తిరస్కరించారని అందుకే తిరుగుబాటు జరిగిందనే కథనాలు వచ్చాయి. దీంతోనే హసీనా దిగిపోయారని.. ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగిందనే ఊహాగానాలు వినిపించాయి. మరికొన్ని విదేశీ శక్తుల పేర్లూ బయటకు వచ్చినా అవేమీ ఖరారు కాలేదు. హసీనా మే నెలలో చేసిన ఆరోపణల ప్రాకం బంగ్లాదేశ్‌ కు చెందిన సెయింట్‌ మార్టిన్‌ దీవిలో వైమానిక స్థావరం ఏర్పాటుకు అమెరికా కోరింది. అలా చేస్తే తన ఎన్నికను సాఫీగా జరిగేటట్లు చేస్తానని చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. వాస్తవానికి హసీనా పేరు చెప్పకున్నా.. ఆ దేశం అమెరికానే అని అందరికీ తెలిసిపోయింది. కారణం.. జనవరిలో జరిగిన బంగ్లా ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా సాగలేదని అమెరికా ఆరోపించడమే.

యూనస్ ఒప్పేసుకున్నారు..

హసీనా దిగిపోయాక బంగ్లాదేశ్ తాత్కాలిక సారథిగా నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ ను ఎంచుకున్నారు. ఈయన భారత్ కు పచ్చి వ్యతిరేకి. పలుసార్లు దానిని బయటపెట్టుకున్నారు కూడా. ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉన్న యూనస్.. హసీనాను దించేయడం ప్లాన్‌ ప్రకారం జరిగిందేనని కుండబద్దలు కొట్టారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ పేరిట ఏర్పాటు చేసిన క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ వార్షిక సమావేశంలో యూనస్ మాట్లాడారు. ఆ సమయంలో వేదికపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ కూడా ఉండడం గమనార్హం. అప్పుడు యూనస్ మాట్లాడుతూ.. విద్యార్థి నాయకులు బంగ్లాదేశ్‌ కు కొత్త రూపు తెచ్చారని కొనియాడారు. హసీనాను పదవి నుంచి దింపే కుట్రవెనక ఎవరున్నారో బయట పడలేదని చెబుతూనే.. మహఫుజ్ అబ్దుల్లా పాత్ర ఉండొచ్చంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు.

మహఫుజ్ అబ్దుల్లా అంటే ఎవరో కాదు.. హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన ఆందోళనలకు నాయకత్వం వహించినవాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారుకి ప్రత్యేక సహాయకునిగా ఉన్నారు. 29 ఏళ్ల మహఫూజ్ అబ్దుల్లా సాగించిన ఉద్యమంతోనే బంగ్లాలో ప్రభుత్వం మారిపోయింది.

Tags:    

Similar News