ముకేశ్ అంబానీ నుంచి ఆ మాట.. గూగుల్.. యాపిల్ కు భారీ దెబ్బ

రంగం ఏదైనా రిలయన్స్ కానీ బరిలోకి దిగితే ప్రత్యర్థులకు చుక్కలు చూపించేయటం దానికి అలవాటే.

Update: 2024-09-01 10:30 GMT

రంగం ఏదైనా రిలయన్స్ కానీ బరిలోకి దిగితే ప్రత్యర్థులకు చుక్కలు చూపించేయటం దానికి అలవాటే. నిజానికి అదే ముకేశ్ అంబానీ వ్యాపార తీరు. చేసేది భారీగా చేయటం.. అప్పటివరకు సదరు రంగంలో ఉన్న వారిని ఉక్కిరిబిక్కిరి చేసేలా ఆఫర్లు ప్రకటించటం ద్వారా ఆకట్టుకొని.. తన బేస్ ను పెంచుకునే రిలయన్స్.. తాజాగా అలాంటి వ్యాపార వ్యూహాన్ని తన కొత్త వ్యాపారంలోనూ అమలు చేస్తున్నారు ముకేశ్ అంబానీ.

నిజానికి ఈ అంశం రెండు.. మూడు రోజుల క్రితం జరిగినా పెద్దగా ఫోకస్ కాలేదు. మీడియా ఈ అంశాన్ని పట్టుకోలేకపోయింది. సోషల్ మీడియా పుణ్యమా అని.. ఈ అంశం హైలెట్ అయ్యింది. ఇంతకూ విషయం ఏమంటే.. ఇటీవల జరిగిన రిలయన్స్ ఏజీఎం.. అదేనండి కంపెనీ వార్షిక సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీ పెద్దాయన ముకేశ్ అంబానీ నోటి నుంచి కీలక ప్రకటన వచ్చింది. దాని సారాంశం ఏమంటే.. దీపావళి నుంచి 100 జీబీ వరకు క్లౌడ్ స్టోరేజీని జియో వినియోగదారులకు ఉచితంగా అందించనున్నట్లుగా పేర్కొన్నారు. ప్రారంభ ఆఫర్ గా దీన్నితమ వినియోగదారులకు అందించనున్నట్లు వెల్లడించారు.

ఈ విభాగంలో ఇప్పటికే బలంగా ఉన్న గూగుల్.. యాపిల్ కు భారీ షాక్ గా చెప్పాలి. ఎందుకుంటే.. ఈ విభాగంలో ఇప్పటికే పయనీర్ గా ఉన్న గూగుల్.. యాపిల్ ధరలు అధికంగా ఉండటమే దీనికి కారణం. ఆండ్రాయిడ్.. యాపిల్ యూజర్లు తరచూ స్టోరేజీ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ 15 జీబీ మాత్రమే స్టోరేజీ చేసుకోవటానికి ఉచితంగా ఇస్తుంది. పెద్ద ఎత్తున వినియోగదారులకు ఈ 15 జీబీ డేటా సరిపోవటం లేదు. దీంతో.. వారు అదనపు స్టోరేజీ కోసం గూగుల్ వన్ ను ఆశ్రయించాల్సి వస్తోంది.

ప్రస్తుతం 100 జీబీ స్టోరేజీ కోసం గూగుల్ వన్ నెలకు రూ.130 వరకు వసూలు చేస్తుండగా.. ఐ క్లౌడ్ లో 50 జీబీ స్టోరేజీకి రూ.75 వసూలు చేస్తోంది. ఇలాంటి వేళ రిలయన్స్ జియో 100 జీబీని ఫ్రీగా ఇస్తామని.. దీనికి మించి ఉంటే సరసమైన ధరలకు అందిస్తామని చెప్పారు. దీంతో.. ఇకపై ఫోటోలు.. వీడియోలతో సహా ఇతర డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకునేందుకు జియో క్లౌడ్ సాయం చేస్తుందని పేర్కొన్నారు. ముకేశ్ అంబానీ నోటి నుంచి వచ్చిన ఈ మాట వినియోగదారులకు వినసొంపుగా ఉంటే.. వ్యాపార పోటీదారులకు మాత్రం భారీ షాకిచ్చేలా మారిందని చెప్పాలి. ముకేశ్ అంబానీనా మజాకానా?

Tags:    

Similar News