వరల్డ్ టాప్ టెన్ బిలియనీర్ల జాబితాలో ఒకే ఒక్క భారతీయుడు!
ముకేశ్ అంబానీ వరుసగా 14 ఏళ్లుగా భారతదేశం నుంచి అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే
ప్రపంచంలో అత్యధిక ధనవంతులు ఎవరు, వారిలో ఏ దేశస్తులు ఎక్కువ మంది, వారు ఏ రంగాలకు చెందినవారు, ఆ జాబితాలో మన దేశానికి సంబంధించి ఎంత మంది ఉన్నారు? ఇలాంటి విషయాలన్నీ ఎప్పుడూ ఆసక్తికరమే.
ఈ నేపథ్యంలో తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతులైన 10 మంది జాబితాలో ఒకే ఒక్క భారతీయుడికి చోటు లభించింది. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ టాప్ టెన్ ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడిగా నిలిచారు.
టాప్ టెన్ ప్రపంచ ధనవంతుల జాబితాలో రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి 9వ స్థానం లభించింది. ముకేశ్ అంబానీ నికర విలువ 83.4 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ అంచనా వేసింది.
ముకేశ్ అంబానీ వరుసగా 14 ఏళ్లుగా భారతదేశం నుంచి అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మధ్యలో కొంతకాలం గౌతమ్ అదానీ రిచెస్ట్ ఇండియన్ గా కొనసాగారు. అయితే ఆయనపై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆరోపణల తర్వాత స్టాక్ మార్కెట్ లో ఆయన కంపెనీల షేర్లు పతనం చవిచూశాయి. దీంతో అదానీ సంపద కరిగిపోయింది. మళ్లీ యధావిధిగా ముకేశ్ అంబానీ అత్యంత ధనవంతుడిగా ముందుకు దూసుకొచ్చారు. ఈ నేపథ్యంలో గతంలో ఫోర్బ్స్ జాబితాలో టాప్ 5లో ఉన్న గౌతమ్ అదానీ సంపద 47.2 బిలియన్ డాలర్లకు తగ్గడంతో ప్రస్తుతం ఆయన 24వ ర్యాంక్ కు పడిపోయారు.
కాగా లూయిస్ విట్టన్ వంటి లగ్జరీ బ్రాండ్ ల సృష్టికర్త అయిన ఫ్రెంచ్ వ్యాపార దిగ్గజం బెర్నార్డ్ ఆర్నాల్ట్ 211 బిలియ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఇక టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ 180 బిలియన్ డాలర్లతో అత్యధిక ధనవంతుల జాబితాలో 2వ స్థానంలో నిలిచారు.
కాగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. 2023లో బిలియనీర్ల సంఖ్య 2,668 నుండి 2,640కి పడిపోయింది. అమెరికా, చైనా తర్వాత భారతదేశం 167 మంది బిలియనీర్లతో 3వ స్థానంలో ఉండటం విశేషం.