పిన్నెల్లి వీడియోపై సీఈవో సంచలన ప్రకటన!

ఈ సమయంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినవిగా చెబుతున్న వీడియోలపై సీఈవో స్పందించారు

Update: 2024-05-23 10:41 GMT

మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఇలాంటి ఘటనలు 7 జరిగాయని ఈసీ చెప్పినా.. దానికి సంబంధించిన ఒక వీడియో మాత్రమే బయటకు రావడం, అది కూడా ప్రైవేటు వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్స్ లో దర్శనమివ్వడంతో ఈసీపై తీవ్ర విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి.

ఎన్నికల కమిషన్ కు తెలియకుండానే ఆ వీడియో బయటకు వచ్చిందా అని ఒకరంటే... మిగిలిన ఘటనలకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేయండి అంటూ వైసీపీ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో... సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనా స్పందించారు. ఈ సందర్భంగా... మరోసారి పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రం విషయంపైనే వ్యాఖ్యానించారు!

ఇందులో భాగంగా పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘటనపై సరైన సమాచారం ఇవ్వనందువల్ల విధుల్లో ఉన్న పీవో, ఏపీవోలను సస్పెండ్‌ చేయాలని ఆదేశాలిచ్చినట్టు సీఈవో మీనా తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు ఎస్పీ, డీఎస్పీలతో 8 పోలీసు బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు.

ఇదే సమయంలో మాచర్లలో టీడీపీ నేతల పర్యటన ఈ సమయంలో సరికాదని చెప్పిన సీఈవో.. అక్కడ ఇప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తోందని అన్నారు. పరామర్శలకు ఈ సమయంలో వెళ్లొద్దని రాజకీయ నేతలకు విజ్ఞప్తి చేశారు. బయటి నుంచి నేతలెవరూ పరామర్శకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

ఈ సమయంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినవిగా చెబుతున్న వీడియోలపై సీఈవో స్పందించారు. ఇందులో భాగంగా... పాల్వాయి పోలింగ్ స్టేషన్‌ లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన విజువల్స్ ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదని తెలిపారు. వీడియో ఎక్కడ, ఎవరి నుంచి బయటకు వెళ్లిందో పోలీస్ దర్యాప్తులో తెలుస్తుందని అన్నారు. 25వ తేదీ నుంచి స్ట్రాంగ్ రూంలను పరిశీలిస్తామని వెల్లడించారు.

Tags:    

Similar News