'ఇస్మార్ట్' మస్క్... మూడో వ్యక్తి మెదడులో చిప్... ఎలా పనిచేస్తుందంటే..?

నెక్స్ట్ టార్గెట్ అంగారక గ్రహంపై కాలనీలు నిర్మించడమే అనే స్థాయిలో వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి.

Update: 2025-01-11 18:30 GMT

ప్రపంచ వ్యాప్తంగా ఎలాన్ మస్క్ అనే వ్యక్తి ఇప్పుడు ఓ సంచలనం. ప్రపంచానికే పెద్దన్న అయిన అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో చక్రం తిప్పిన ఆయన.. అంతరిక్ష రంగంలోనూ తనదైన మార్కు చూపిస్తున్నారు.. స్పేస్ వాక్ చేయిస్తున్నారు! మరోపక్క సోషల్ మీడియా రంగంలోనూ, ఎలక్ట్రానిక్ కార్ల రంగంలోనూ దూసుకుపోతున్నారు.

నెక్స్ట్ టార్గెట్ అంగారక గ్రహంపై కాలనీలు నిర్మించడమే అనే స్థాయిలో వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. ఇక జనవరి 20న ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత పరిస్థితి ఏమిటనేది వేచి చూడాలి. ఈ సమయంలో.. తాజాగా మరో వ్యక్తికి చిప్ ను అమర్చినట్లు ప్రకటించి.. పలు కీలక విషయాలు వెల్లడించారు న్యూరాలింక్ సీఈఓ ఎలాన్ మస్క్.

అవును... మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చే ప్రయోగాలు వేగవంతంగా జరుగుతున్నా. ఈ క్రమంలో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులకు చిప్ అమర్చిన న్యూరాలింక్.. ఇప్పుడు తాజాగా మరో వ్యక్తికి చిప్ ను అమర్చింది. ఈ విషయాలను ఆ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆ ముగ్గురిలోనూ మంచి పనితీరు కనిపిస్తోందని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో ఈ ఏడాదిలో సుమారు 20 నుంచి ముప్పై మందిలో ఈ తరహా చిప్ లు అమర్చేలా ముందుకు వెళ్తున్నామని మస్క్ తెలిపారు. వెన్నుముఖ, మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయ పడేలా ఈ డివైజ్ ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. లాస్ వెగాస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మస్క్ ఈ విషయాలు వెల్లడించారు.

కాగా... ఈ ప్రక్రియలో పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్1 అనే చిప్ ను అమరుస్తారు. న్యూరాలింక్ బ్రెయిన్ - కంప్యూటర్ ఇంటర్ ఫేస్ లో 8 మి.మీ. వ్యాసం కలిగిన ఈ ఎన్1 చిప్ లో వెంట్రుకతో పోలిస్తే 20 వంతు మందం మాత్రమే ఉండే సన్నని ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వీటీని మెదడులోకి చొప్పిస్తారు. ఈ ఎలక్ట్రోడ్ లు ఒక్కో చిప్ లో 3,000 కు పైగా ఉంటాయి.

సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉండే వీటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. ఇవి.. మెదడులోని నూర్యాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్ కు పంపుతాయి. ఈ చిప్ లోని ఎలక్ట్రోడ్లు సుమారు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. ఈ క్రమంలో ఒక్కో వ్యక్తిలోనూ 10 చిప్ లను ప్రవేశపెట్టొచ్చని చెబుతున్నారు.

ఇవి మెదడులో ఇన్ స్టాల్ అయిన తర్వాత ఈ న్యూరాలింక్ బ్రెయిన్ – కంప్యూటర్ ఇంటర్ ఫేస్... మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపడం, అందుకొవడం, కొన్ని సందర్భాల్లో ప్రేరేపించడం వంటివి చేస్తుంది. అనంతరం వాటిని కంప్యూటర్ విశ్లేషించి ఆల్గారిథం లుగా మారుస్తాయి!

Tags:    

Similar News