ట్రంప్ హోటల్ దగ్గర భారీ పేలుడ్ని అడ్డుకున్న మస్క్ సైబర్ ట్రక్
భారీ పేలుడు తర్వాత కూడా ఈ వాహన అద్దాలు మినహా మిగిలిన భాగాలేవీ పెద్దగా దెబ్బతినకపోవటంతో సైబర్ ట్రక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అమెరికాలో చోటు చేసుకున్న ఒక భారీ పేలుడు షాకింగ్ గా మారితే.. ఆ పేలుడు తీవ్రతను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కు చెందిన సైబర్ ట్రక్ సేవ్ చేసిన వైనం సంచలనంగా మారింది. భారీ పేలుడు తర్వాత కూడా ఈ వాహన అద్దాలు మినహా మిగిలిన భాగాలేవీ పెద్దగా దెబ్బతినకపోవటంతో సైబర్ ట్రక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఉదంతంపై సోషల్ మీడియాలోని పోస్టులకు ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. వెల్లడిస్తున్న వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. సైబర్ ట్రక్ మీద అంచనాల్ని పెంచేయటం గమనార్హం.
లాస్ వెగాస్ లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ వద్ద భారీ పేలుడు చోటు చేసుకుంది. అయితే.. ఈ పేలుడును సైబర్ ట్రక్ అడ్డుకోవటమే కాదు.. తీవ్రతను తక్కువ చేసినట్లుగా పేర్కొన్నారు. ట్రంప్ హోటల్ వద్ద జరిగిన పేలుడుకు అద్దెకు తెచ్చిన ఒక సైబర్ ట్రక్ అమర్చిన భారీ మందుగుండు కారణమని ధ్రువీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. భారీ పేలుడు జరిగే సమయానికి సైబర్ ట్రక్ లోని అన్ని టెలిమెట్రీలు సక్రమంగా పని చేస్తున్నట్లుగా చెప్పారు.
ఇదంతా కావాలనే చేసిన పేలుడుగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఒక పోస్టులో మస్క్ ఆసక్తికర రీతిలో స్పందించారు. కారు బాంబులకు సైబర్ ట్రక్ ను ఎంపిక చేసుకోవటం చెత్త నిర్ణయమన్నారు. మరే వాణిజ్య వాహనానికి సాధ్యం కాని రీతిలో సైబర్ ట్రక్ స్టెయిన్ లెస్ స్టీల్ కవచం పేలుడు తీవ్రతను అడ్డుకుందన్నారు. పేలుడుకు కారణమైన వారు తమ దాడికి తప్పుడు వాహనాన్ని ఎంపిక చేసుకున్నారన్న మస్క్.. ‘‘వాస్తవానికి సైబర్ ట్రక్ లో పేలుడు పదార్థాలు ఉన్నాయి. వాటి తీవ్రతకు అక్కడ లాబీకి ఉన్న గాజు అద్దాలు కూడా పగల్లేదు. పేలుడులో దెబ్బ తిన్న ట్రక్కును మళ్లీ పని చేసేలా చేస్తాం’’ అని పేర్కొన్నారు.
ఇక్కడే సైబర్ ట్రక్ గురించి చెప్పాలి. టెస్లా కంపెనీ తన వాణిజ్య కారును మార్కెట్లోకి తెచ్చే సమయంలో అదెంత బలంగా ఉంటుందన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చెప్పేందుకు..కారును సుత్తులతో కొట్టించారు. అంతేకాదు.. ఇనుపగుండ్లతో దాడి చేయించి మరీ చూపించారు. అంతటి స్ట్రాంగ్ బాడీ ఉన్న సైబర్ ట్రక్ ను తమ పేలుడుకు దుండగులు వాడారు.
పేలుడు జరిగే సమయానికి వాహనంలో మోర్టార్ లు.. క్యాంప్ ప్యూయల్ కెనిస్టర్లు ఉన్నట్లుగా చెబుతున్నారు. పేలుడు నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ ట్రక్ ను ఎవరు అద్దెకు తీసుకున్నది గుర్తించినట్లుగా చెప్పారు.అయితే.. ఆ వివరాల్ని తాము వెల్లడించమన్నారు. అయితే.. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ వస్తున్న రిపోర్టుల ప్రకారం చూస్తే.. కొలరాడో స్ప్రింగ్ కు చెందిన మాథ్యూ లివెల్స్ బెర్గర్ గా అనుమానిస్తున్నారు. అతను నివసించే ప్రాంతానికి ఎఫ్ బీఐ దళాలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక.. మాథ్యూ ఎవరన్న విషయానికి వస్తే.. అతను అమెరికాలోని ప్రత్యేక దళమైన గ్రీన్ బెరెట్స్ లో పనిచేశాడు. కమ్యూనికేషన్.. నిఘా నిపుణుడిగా.. అన్ మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ విభాగంలోనూ అతనికి అనుభవం ఉందని చెబుతారు. ఈ పేలుడులో అతను మరణించాడు.
మరోవైపు అమెరికాలోని ఆర్లీన్ లో జరిగిన దాడికి కూడా మాజీ సైనికుడే ప్రధాన నిందితుడు కావటం గమనార్హం. ఈ రెండు ఉదంతాలకు వినియోగించిన కార్లు అద్దెకు తీసుకోవటం.. రెండూ ట్యూరో అనే యాప్ నుంచి బుక్ చేశారు. ఈ యాప్ ద్వారా కార్ల యజమానులు తమ కార్లను అద్దెకు ఇచ్చే వీలుంది. ఈ యాప్ లో ఖరీదైన స్పోర్ట్స్ కార్ల నుంచి మినీ వ్యాన్ల వరకు అందుబాటులో ఉంటాయి. తాజాగా జరిగిన రెండు విధ్వంసాలకు వాడిన కార్లలో ఒకటి ఫోర్డు కంపెనీకి చెందింది కాగా.. రెండోది టెస్లాకు సంబంధించింది. ఈ రెండు అత్యాధునిక ఫీచర్లు ఉన్న వాహనాలు కావటం విశేషం.