ఏమైంది మైహోం భుజాకు.. వరుస ఘటనలో కొత్త వాదనలు!
ఇటీవల కాలంలో కొన్ని ఆత్మహత్యలు.. అనుమానాస్పద మరణాలతో పాటు.. చట్టవిరుద్దమైన కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి.
హైదరాబాద్ మహనగరంలో అత్యంత ఖరీదైన భవన సముదాయాల్లో ఒకటి మైహోం భుజా. ఈ భారీ టవర్లలో పేరు ప్రఖ్యాతులున్నప్రముఖులు మాత్రమే కాదు.. పలు కార్పొరేట్ కంపెనీలకు చెందిన అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు.. పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసేవారు.. బంగారు.. వజ్ర వ్యాపారాలు చేసే వారికి ఇందులో ప్లాట్లు ఉన్నాయి. నివాస భవన సముదాయంతో పాటు.. కొన్ని కమర్షియల్ ప్లాట్లు కూడా ఇందులో ఉన్నాయి. అత్యంత ఖరీదైన భవనాల్లో ఒకటిగా ముందు వరుసలో ఉన్న మైహోం భుజాకు ఇప్పుడు నెగిటివ్ ఇమేజ్ ఎక్కువ అవుతోంది.
ఇటీవల కాలంలో కొన్ని ఆత్మహత్యలు.. అనుమానాస్పద మరణాలతో పాటు.. చట్టవిరుద్దమైన కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. రెండు వారాల క్రితం ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. వైసీపీ నేత వల్లభనేని వంశీని ఆ రాష్ట్రానికి చెందిన పోలీసులు అరెస్టు చేయటం తెలిసిందే. ఆయన మైహోం భుజాలో ఉండేవారు.
తాజాగా ప్రముఖ సినీ నటుడు కం వైసీపీ నేత పోసాని క్రిష్ణ మురళిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. ఆయన కూడా మైహోం భుజా నివాసి కావటంతో ఈ భవన సముదాయం గురించిన ఆసక్తికర చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ నడుస్తోంది. తరచు ఏదో ఒక సంచలన ఉదంతానికి కేరాఫ్ అడ్రస్ గా మైహోం భుజా నడుస్తోంది. అదే సమయంలో అనూహ్య విషాదాలు కూడా ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి.
ఇలాంటి వేళ.. మైహోం భుజా వాస్తు సరిగా లేదా? అన్నది చర్చగా మారింది. వేలాది కోట్ల రూపాయిలతో నిర్మించిన ఈ భారీ భవన సముదాయంలో ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా నిర్మిస్తారా? అన్నది ప్రాథమిక ప్రశ్నగా చెప్పాలి. అయితే.. వరుసగా ఒకే పార్టీకి చెందిన ఇద్దరి ప్రముఖుల అరెస్టుకు ఒకే భవనం కావటంతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని మాత్రం చెప్పక తప్పదు. అంతేకానీ.. వాస్తుదోషం లాంటి మాటల్ని పిచ్చ లైట్ గా తీసుకోవాల్సి ఉంది.
వందలాది కుటుంబాలు ఉండే ఈ భారీ భవన సముదాయంలో హైప్రొఫైల్ వ్యక్తులు ఉండటం.. రాజకీయ పరిణామాలతో జరిగే అరెస్టులకు.. వాస్తుకు ఏ మాత్రం లింకు లేదన్నది నిజమైనప్పటికీ.. వాస్తు దోషం మాటను విన్నంతనే ఉలిక్కిపడేలా మారిందని చెప్పాలి. ఏమైనా.. పోసాని అరెస్టుతో మరోసారి మైహోం భుజా మరోసారి వార్తల్లోకి ఎక్కిందని చెప్పక తప్పదు. తాజా వాదనల పుణ్యమా అని.. మైహోం భుజాలో ఇంకెవరు వైసీపీకి చెందిన వారు ఉన్నారన్న ఆసక్తికర చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.