ఇబ్బంది పెడితే దీటుగా బదులిస్తా.. మైనంపల్లి మళ్లీ వేసేశారు
టికెట్ దక్కినప్పటికీ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఎక్కడా అసమ్మతిని ఆపుకోవడం లేదు
టికెట్ దక్కినప్పటికీ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఎక్కడా అసమ్మతిని ఆపుకోవడం లేదు. సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ తగ్గడం లేదు. తనను ఇబ్బంది పెడితే దీటుగా బదులిస్తానంటూ పార్టీని హెచ్చరించారు.
తిరుమలలో సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంగళవారం మళ్లీ నోరు విప్పారు. మల్కాజ్ గిరి టికెట్ తనకు ఇచ్చినా.. కుమారుడికి మెదక్ స్థానం కేటాయించకపోవడంతో హనుమంతరావు ఆగ్రహంతో ఉన్నట్ల తెలుస్తోంది. అయితే, తాను సోమవారం తాను మాట్లాడింది పార్టీ గురించి కాదని.. వ్యక్తిగత అభిప్రాయాలని సమర్థించుకున్నారు. మంగళవారం మైనంపల్లి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మరోసారి మాట్లాడారు. హైదరాబాద్ కు వెళ్లాక తన కార్యాచరణ వెల్లడిస్తానని మైనంపల్లి తెలిపారు.
కుమారుడే ముఖ్యం..
మెదక్ టికెట్ ను కుమారుడు రోహిత్ కు ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్న మైనంపల్లి.. ఎవరేమనుకున్నా తనకు తన కుమారుడే ముఖ్యమని స్పష్టం చేశారు. జీవితంలో తాను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని పేర్కొన్నారు. అయితే, తనను ఇబ్బంది పెడితే కచ్చితంగా తానూ బదులిస్తానని హెచ్చరించారు. ''మెదక్ , మల్కాజిగిరి కార్యకర్తలే నాకు ప్రాధాన్యం. నేను ఏ పార్టీనీ విమర్శించను. పార్టీలకు అతీతంగా ఉంటా. మా అబ్బాయికి సీటిస్తే.. గెలిపించుకుని వస్తా'' అని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో తన కుమారుడు ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజాసేవ చేశారని చెప్పుకొచ్చారు.
మరి నిన్నటి వ్యాఖ్యలో..?
తనకు మల్కాజిగిరితో పాటు తన కుమారుడు రోహిత్ కు మెదక్ సీట్లిస్తనే.. బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తానని.. లేదంటే స్వతంత్రంగా బరిలోకి దిగుతానని సోమవారం మైనంపల్లి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెలమ హాస్టల్ కు రబ్బరు చెప్పులు, ట్రంకు పెట్టెతో వచ్చిన హరీశ్ నేడు వేల కోట్లు సంపాదించారని తీవ్రంగా ఆరోపించారు. హరీశ్ మెదక్ లో పెత్తనం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇక అవసరమైతే హరీశ్ మీద పోటీ చేస్తానని కూడా పేర్కొన్నారు.
టికెట్ కు ఎసరు..
మైనంపల్లికి మల్కాజిగిరి సీటు ఇస్తూనే.. సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ టికెట్ కేటాయింపులను ప్రకటించిన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ లెక్కన హనుమంతరావు టికెట్ కు మంత్రి మల్లారెడ్డి అల్లుడిని పోటీకి తెచ్చి ఎసరు పెట్టారు. మెదక్ టికెట్ ను సిటింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఇచ్చారు. ఇదే సమయంలో మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ఖండిస్తూ ట్వీట్ చేశారు. తామంత హరీశ్ వెంటే ఉన్నామని స్పష్టం చేశారు. మైనంపల్లిపై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం మరోసారి మైనంపల్లి స్పందించారు.
విషయం వివాదం ఏమిటంటే..
మైనంపల్లి 2009లో మెదక్ నుంచి టీడీపీ తరఫున గెలిచారు. అయితే అప్పటినుంచి ఆయన చూపు మల్కాజిగిరి వైపే ఉంది. 2014 ఎన్నికల్లో అక్కడినుంచి పోటీకి దిగాలని భావించారు. ఈ ప్రయత్నం ఫలించలేదు. ఎట్టకేలకు బీఆర్ఎస్ లోకి వచ్చాక 2018లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు తన పాత నియోజకవర్గం మెదక్ ను కుమారుడికి ఇవ్వాలని కోరుతున్నారు. కానీ, అక్కడ పద్మా దేవేందర్ రెడ్డి వంటి నాయకురాలు ఉండడంతో బీఆర్ఎస్ అధిష్ఠానం మరో మాట లేకుండా మైనంపల్లి ప్రతిపాదనను పక్కన పెట్టింది.
దీంతోనే మైనంపల్లి లోలోన రగులుతున్నారు. కుమారుడికి మెదక్ ఇవ్వకుండా తనకు మల్కాజిగిరి టికెట్ ఇచ్చినా స్వతంత్రంగా బరిలో దిగుతానని స్పష్టం చేశారు. అయితే, టికెట్ల ప్రకటన సందర్భంగా కేసీఆర్ హెచ్చరిక స్వరంతో వ్యాఖ్యలు చేయడం, మల్కాజిగిరికి మల్లారెడ్డి అల్లుడిని సిద్ధం చేస్తున్నారన్న కథనాలు రావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి ప్రతిగానే ''నన్ను ఇబ్బంది పెడితే నేనూ బదులిస్తా'' అని మైనంపల్లి వ్యాఖ్యానించినట్లు స్పష్టమవుతోంది.