మెదక్ సిత్రం.. అప్పట్లో తల్లి.. తండ్రి గెలిచిన ప్రత్యర్థి మీద కొడుకు పోరు!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పోరులకు కొదవ లేదు. అయితే.. వీటల్లోనూ సమ్ థింగ్ స్పెషల్ అన్నట్లుగా సాగుతున్న పోటీలు కొన్ని ఉన్నాయి

Update: 2023-11-18 04:44 GMT

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పోరులకు కొదవ లేదు. అయితే.. వీటల్లోనూ సమ్ థింగ్ స్పెషల్ అన్నట్లుగా సాగుతున్న పోటీలు కొన్ని ఉన్నాయి. ఆ కోవలోకే వస్తుంది మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం. ఈ స్థానం టికెట్ కోసం సాగిన పోరు.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలన పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించిన మైనంపల్లి హన్మంతరావు కుమారుడికి గులాబీ బాస్ నో చెప్పటంతో.. పార్టీ మారటం.. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగటం తెలిసిందే.

ఇదంతా ఒక లెక్క అయితే.. అందరికి తెలియని లెక్క మరొకటి ఉంది. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో మైనంపల్లి కుటుంబానికి సుదీర్ఘ అనుబంధం ఉంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న పద్మా దేవేందర్ రెడ్డి మీద మైనంపల్లి కుటుంబం పోటీ చేయటం గెలవటం.. ఓడటం లాంటి పరిణామాలు ఉన్నాయి. 2004 సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మైనంపల్లి వాణి (ప్రస్తుత అభ్యర్థి తల్లి) పోటీ చేశారు. టీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన పద్మాదేవేందర్ రెడ్డి విజయం సాధించారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డిపై రోహిత్ తండ్రి మైనంపల్లి హన్మంతరావు విజయం సాధించి.. తన భార్య ఓటమికి బదులు తీర్చుకున్నారు.

2009లో అసెంబ్లీ పునర్విభజనలో భాగంగా రామాయంపేటను మెదక్ నియోజకవర్గంలో కలిపేశారు. అప్పట్లోజరిగిన ఎన్నికల్లో టీడీపీ-టీఆర్ఎస్ ఉమ్మడి అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావుకు టికెట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పద్మాదేవేందర్ రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లోనూ హన్మంతరావు విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున మైనంపల్లి పోటీ చేయగా.. మెదక్ స్థానం నుంచి పద్మాదేవేందర్ పోటీ చేశారు. వీరు ఇరువురు విజయం సాధించారు. గడిచిన రెండు దఫాలుగా పద్మా దేవేందర్ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వస్తున్నారు.

తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి మైనంపల్లి కుటుంబం మెదక్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మైనంపల్లి హన్మంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్ టికెట్ దక్కించుకున్నారు. నామినేషన్ల సమయంలో రోహిత్ తో పాటు ఆయన తల్లి వాణి కూడా నామినేషన్లు దాఖలు చేవారు. అనంతరం వాణి తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. ఇలా పద్మా దేవేందర్ మీద మైనంపల్లి రోహిత్ తల్లి.. తండ్రి వేర్వేరుగా పోటీ చేశారు. ఇప్పుడు వారి అబ్బాయి బరిలో నిలిచారు. మెదక్ స్థానాన్ని ఏం చేసైనా సరే గెలిచి చూపించాలని పద్మా దేవందర్ రాజకీయ గురువు హరీశ్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పెషల్ టాస్కు ఇవ్వటం తెలిసిందే. దీంతో.. ఈ స్థానం తుది ఫలితం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News