మైక్రోసాఫ్ట్ పెద్ద ముందడుగు.. శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరణ
క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో మైక్రోసాఫ్ట్ మరో పెద్ద ముందడుగు వేసింది. మయోరానా-1 పేరుతో ఒక విప్లవాత్మక క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ (క్యూపీయూ)ను ఆవిష్కరించింది.
క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో మైక్రోసాఫ్ట్ మరో పెద్ద ముందడుగు వేసింది. మయోరానా-1 పేరుతో ఒక విప్లవాత్మక క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ (క్యూపీయూ)ను ఆవిష్కరించింది. అరచేతిలో ఇమిడిపోయే ఈ చిన్న యూనిట్‌ను ‘గాడ్ చిప్’గా పేర్కొంటున్నారు. ఈ సాధనం కంప్యూటింగ్ ప్రపంచాన్ని సమూలంగా మార్చనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది పదార్థ శాస్త్రం, కృత్రిమ మేధ, ఔషధ పరిశోధన వంటి కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని చెబుతున్నారు.
- టోపోలాజికల్ కోర్ ఆధారంగా అభివృద్ధి
ఈ చిప్ టోపోలాజికల్ కోర్ ఆధారంగా రూపొందించబడిన తొలి క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్‌గా మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఇది పదార్థ శాస్త్రంలో ఇటీవల కనుగొన్న కొత్త దశ ఆధారంగా పనిచేస్తుంది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ "పదార్థాలు ఘన, ద్రవ, వాయు అనే మూడు దశల్లో మాత్రమే ఉంటాయని మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. కానీ నేడు ఆ భావన మారింది" అని తెలిపారు. టోపోకండక్టర్స్ అనే కొత్త రకం పదార్థం వల్ల ఈ మయోరానా-1 చిప్ అభివృద్ధి సాధ్యమైందని వెల్లడించారు. రెండు దశాబ్దాల పరిశోధన ఫలితంగా ఈ టోపోకండక్టర్స్‌ను తయారు చేయగలిగామని తెలిపారు.
- మయోరానా-1 ప్రత్యేకతలు
క్వాంటమ్ కంప్యూటింగ్‌లో కీలకమైన సమస్య ఒకటి ఉంది అదే క్యూబిట్ల స్థిరత. క్వాంటమ్ కంప్యూటర్లలో క్యూబిట్లు ముఖ్యమైన బ్లాక్‌లుగా పనిచేస్తాయి. అయితే ఇవి చాలా అస్థిరంగా ఉండటంతో తక్కువ ఉష్ణోగ్రతల్లో (-270 డిగ్రీల సెల్సియస్) ఉంచాల్సిన అవసరం ఉంటుంది. అయినప్పటికీ అవి లోపాలను ఎదుర్కొంటూనే ఉంటాయి. మైక్రోసాఫ్ట్ ఈ సమస్యను టోపోకండక్టర్ల ద్వారా పరిష్కరించగలిగింది. ఈ పదార్థాలు క్యూబిట్లకు స్థిరమైన వేదికను అందిస్తాయి. దీంతో అవి మరింత కచ్చితంగా పనిచేయగలుగుతాయి. ఈ పరిజ్ఞానం ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్ కొత్త పరివర్తనాత్మక పరిష్కారాలను అందించగలదు.
* మయోరానా-1 ప్రత్యేకతలు..
మయోరానా-1 ద్వారా అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు సాధ్యమవుతాయని మైక్రోసాఫ్ట్ విశ్వాసం వ్యక్తం చేసింది. ముఖ్యంగా:
1. పర్యావరణ పరిరక్షణ: మైక్రోప్లాస్టిక్స్‌ను హానిరహిత పదార్థాలుగా మార్చే పరిజ్ఞానం.
2. నిర్మాణ రంగం: స్వీయ మరమ్మతు పదార్థాల అభివృద్ధి.
3. ఆరోగ్య పరిరక్షణ: కొత్త ఔషధాల రూపకల్పనలో విప్లవాత్మక మార్పులు.
- భవిష్యత్తు దిశగా..
ఈ విప్లవాత్మక టెక్నాలజీ మరింత వేగవంతమైన, స్థిరమైన, చౌకైన క్వాంటమ్ కంప్యూటర్ల అభివృద్ధికి దారి తీస్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన ఈ ముందడుగు, శాస్త్రసాంకేతిక రంగంలో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ మరింత విస్తరించి.. అనేక పరిశ్రమలకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.