నా టికెట్ చంద్రబాబు చలువే.. నాటి కాంగ్రెస్.. నేటి బీఆర్ఎస్ అభ్యర్థి!
మంత్రి మొదలు.. ఎమ్మెల్యేల దాకాఏపీ మాజీ సీఎం చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసిన మొదట్లో తెలంగాణ ఎమ్మెల్యేలు ఎవరూ పెద్దగా స్పందించలేదు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు హైదరాబాద్ నగర బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో దడ పుట్టిస్తోంది. సీమాంధ్రులు డిసైడింగ్ ఫ్యాక్టర్ కావడం.. అందులోనూ చంద్రబాబు అరెస్టుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించకపోవడంతో వారిలో గెలుపుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సీమాంధ్రులు గనుక చంద్రబాబు అరెస్టును నెగెటివ్ గా తీసుకుని తమకు ఓటు వేయకుంటే ఓటమి ఖాయమని హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా కలవరం చెందుతున్నారు.
మంత్రి మొదలు.. ఎమ్మెల్యేల దాకాఏపీ మాజీ సీఎం చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసిన మొదట్లో తెలంగాణ ఎమ్మెల్యేలు ఎవరూ పెద్దగా స్పందించలేదు. బీఆర్ఎస్ వారైతే.. ఎటుపోయి ఎటు వస్తుందోనని మౌనంగా ఉన్నారు. కానీ, చంద్రబాబు అరెస్టుపై హైదరాబాద్ లో స్థిరపడిన సీమాంధ్రుల్లో వస్తున్న స్పందనను గమనించారో? ఏమో మెల్లగా నోరు తెరవడం మొదలుపెట్టారు. గత ఎన్నికల సందర్భంగా ఏపీకి వెళ్లి మరీ చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్ అయితే మరింత ఎక్కువగా స్పందిస్తున్నారు. ఆయన నియోజకవర్గం సనత్ నగర్ లో అత్యధికం సీమాంధ్రులు ఉండడంతో తలసాని హడావుడి మామూలుగా లేదు.
కూకట్ పల్లి నుంచి ఎల్బీ నగర్ వరకు హైదరాబాద్ లో సీమాంధ్రులు అత్యధికంగా స్థిరపడిన నియోజకవర్గాలు ఎల్బీనగర్, కూకట్ పల్లి. వీటిలో సీమాంధ్ర ఓటర్లే అత్యధికం అని తేలినా ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణారావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి లు చంద్రబాబు అరెస్లును అదే పనిగా ఖండిస్తున్నారు. కేవలం 40 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా సుధీర్ రెడ్డి అయితే పెద్ద స్టేట్ మెంటే ఇచ్చారు.
అప్పుడు టికెట్ చంద్రబాబు ఇచ్చారట..2018లో తనకు టికెట్ చంద్రబాబు చలువతో దక్కిందని.. కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని అంటున్నారు సుధీర్ రెడ్డి. 2018 ఎన్నికల్లో గెలిచాక ఆయన బీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ టికెట్ ఆయనకే దక్కింది. అయితే, స్థానికంగా ఉన్న వ్యతిరేకతకు తోడు చంద్రబాబు అరెస్టులో కేసీఆర్ వైఖరికి నిరసనగా ఉన్న సీమాంధ్రులు బీఆర్ఎస్ కు ఓటు వేసేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. దీంతో సుధీర్ రెడ్డి ఇక తప్పదని చంద్రబాబును పొగిడే పనిలో పడ్డారు. 2018 ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్-వామపక్షాలు మహా కూటమిగా ఏర్పడి పోటీచేశాయి. నాడు తనకు టికెట్ దక్కడంలో కాంగ్రెస్ వారి కంటే చంద్రబాబు పాత్రే అధికమని తాజాగా సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం.
కొసమెరుపు: ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దివంగత సీఎం వైఎస్ కు అత్యంత సన్నిహితుడు. వైఎస్ పాదయాత్రలోనూ పాల్గొన్నారు. ఆయన కుమారుడు జగన్ కూ అత్యంత సన్నిహితంగా మెలిగారు. కానీ, అదే జగన్ ప్రభుత్వం చేసిన చంద్రబాబు అరెస్టును మాత్రం ఖండిస్తున్నారు. అంతా ఎన్నికల కాల మహిమ.