మినిస్టర్ నాగబాబు...ఇదే కన్ ఫర్మ్ ?

మెగా బ్రదర్ నాగబాబు అంటే చాలా చెప్పాలి. అన్నకు తమ్ముడిగా తమ్ముడికి అన్నగా అత్యంత కీలక స్థానంలో కనిపిస్తుంటారు.

Update: 2024-12-09 22:30 GMT

మెగా బ్రదర్ నాగబాబు అంటే చాలా చెప్పాలి. అన్నకు తమ్ముడిగా తమ్ముడికి అన్నగా అత్యంత కీలక స్థానంలో కనిపిస్తుంటారు. అటు అన్న చిరంజీవి మెగాస్టార్. ఇటు తమ్ముడు పవర్ స్టార్ ల మధ్యన నాగబాబు ఏమిటి అంటే కోపరేట్ స్టార్ అని అంతా తమాషాగా అంటూంటారు.

నాగబాబుని ఈ విషయంలో మెచ్చుకుని తీరాలి. అన్నదమ్ముల అనుబంధం అంటే ఆయనే వారధిగా సారధిగా కనిపిస్తారు. ఆయనకు అన్నతమ్ములంటే అమితమైన ప్రేమ తప్ప దేని మీద మోజు లేదు అన్నది దగ్గరగా చూసేవారు కాదు దూరంగా ఉండేవారు కూడా ఇట్టే అర్థం చేసుకుంటారు.

ఈ రోజులలో పదవుల కోసం జరిగే పోరాటాలు అందరికీ తెలిసిందే. అలాంటిది అందిన ఎంపీ పదవిని వదిలేసి రావడం అంటే అక్కడ నాగబాబు ఒక్కరే అని చెప్పాలి. ఆయన తాను అధికార హోదాలు అనుభవించాలన్న కోరిక ఏ కోశానా లేదు అనేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి.

ఇవన్నీ పక్కన పెడితే కూటమి ప్రభుత్వం లో నాగబాబు కోసం అనేక పదవులు రెడీగా ఉన్నాయని టాక్ అయితే నడచింది. ఆయన కోసమే టీటీడీ చైర్మన్ పోస్టు అన్నారు. అయితే తాను రేసులో లేను అని నాగబాబు చెప్పేశారు. ఇక తాజాగా రాజ్యసభకు వెళ్లేది నాగబాబే ఇది పక్కా అని అనేశారు.

కానీ దానికి కూడా నాగబాబు నుంచి ఇలాగే స్పందన వచ్చింది. తాను జనసేనకు అచ్చమైన సైనికుడిని అని అధినేత నిర్ణయమే శిరోధార్యం అనేశారు. అలా మూడు రాజ్యసభ ఖాళీలకూ అభ్యర్ధులు ఖరారు అయిపోయారు. మరి నాగబాబు పార్టీ కోసం కూటమి గెలుపు కోసం ఎంతో చేశారు కదా ఆయనకు న్యాయం చేయాల్సిందే కదా అన్న చర్చ అయితే సాగుతూ వస్తోంది.

ఇపుడు సడెన్ గా మరో ప్రచారం ముందుకు వచ్చింది. అదేంటి అంటే నాగబాబుకు ఏపీ కేబినెట్ లో మంత్రి పదవి ఖాయమని. ఆయన తొందరలోనే మంత్రిగా చంద్రబాబు మంత్రివర్గంలో చేరబోతున్నారు అని. ఇది ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఒక వైపు రాజ్యసభకు ముగ్గురు అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేస్తున్న వేళ నాగబాబుకు దక్కబోయే పదవి గురించే చర్చించుకుంటున్నారు. ఇది నిజమేనా అని కూడా అంతా ఆరా తీస్తున్నారు. అయితే దీనికి పూర్తిగా అవకాశాలు అయితే ఉన్నాయి. ఏపీ కేబినెట్ లో 24 మందికే చాన్స్ ఇచ్చారు. ఒక బెర్త్ ఇంకా అలాగే ఖాళీగా ఉంది. ఆ ఒక్క ఖాళీ ఎవరి కోసం అంటే నాగబాబు కోసమే అని అంటున్నారు. మరి నాగబాబు శాసనసభలోనూ శాసనమండలిలోనూ మెంబర్ కాదు కదా అంటే దానికీ దారి ఉంది అంటున్నారు.

రానున్న ఆరు నెలల కాలంలో మండలిలో చాలా పదవులు ఖాళీ అవుతాయని అంటున్నాదు. అందులో ఒక దానిని నాగబాబుకు ఇస్తారని అంటున్నారు. అలా ఎమ్మెల్సీగా నాగబాబు నియమితులు అవుతారని అంటున్నారు. అయితే దానితో సంబంధం లేకుండా ఈ మధ్యలో ఎపుడైనా నాగబాబు మంత్రి పదవి చేపట్టవచ్చు అని కూడా చెబుతున్నారు.

ఇక చూస్తే కనుక 2025 మార్చిలో నాలుగు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. అందులో యనమల రామక్రిష్ణుడు, అశోక్ బాబు, బి తిరుమల నాయుడు, దువ్వాడ రామారావు ఉన్నారు. ఇవి కాకుండా వైసీపీ నుంచి నలుగురు ఇప్పటికే రాజీనామాలు చేశారు. అప్పటికి వీరి రాజీనామాలు అమోదం పొందుతాయని అంటున్నారు. అలా ఎనిమిది దాకా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఇందులో ఒకటి నాగబాబుకు కన్ ఫర్మ్ అయింది అని అంటున్నారు. దాంతో నాగబాబు అతి తొందరలో మంత్రిగా ప్రమాణం చేస్తారు అని అంటున్నారు.

అటు చంద్రబాబు పవన్ తలచుకోవాలే కానీ కీలకమైన శాఖలతో నాగబాబు మినిస్టర్ కావడం తథ్యమని అంటున్నారు. మొత్తానికి మెగా బ్రదర్ పెద్దల సభకు వెళ్లేది ఢిల్లీకి కాదని ఏపీలోని శాసన మండలికి అని దాంతో పాటుగా మంత్రి పదవి ఆయనకే ఇస్తారని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.

Tags:    

Similar News