నాగబాబు టూర్ తో కూటమిలో చిచ్చు!
ఈ నేపథ్యంలో నాగబాబు ముందే జనసేన టీడీపీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు అయితే సాగింది. నిజానికి చూస్తే కొంతకాలంగా రెండు పార్టీల మధ్య అంత సయోధ్య అయితే లేదు.;

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ అయిన నాగబాబు పర్యటన పిఠాపురంలో కూటమి మధ్య చిచ్చు రేపిందా అన్న చర్చ అయితే సాగుతోంది. నాగబాబు ఎమ్మెల్సీ కావడంతోనే రెండు రోజుల టూర్ కి పిఠాపురం వచ్చారు. అయితే నాగబాబు టూర్ లో ఎక్కడా టీడీపీ కనిపించకపోవడంతో పాటు ఇంచార్జి ఎస్వీఎస్ఎన్ వర్మకు ఈ టూర్ లో ఆహ్వానం అందకపోవడంతో సహజంగానే తమ్ముళ్లకు ఆగ్రహం వచ్చింది.
అది కాస్తా పిఠాపురంలో నాగబాబుకు టీడీపీ కార్యకర్తల నుండి నిరసన సెగ తగిలేలా చేసింది. నాగబాబు తన రెండో రోజు పర్యటనలో భాగంగా కుమారపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అయితే నాగబాబుని వెన్నంటి ఉంటూ జై వర్మ అని టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
ఈ నేపథ్యంలో నాగబాబు ముందే జనసేన టీడీపీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు అయితే సాగింది. నిజానికి చూస్తే కొంతకాలంగా రెండు పార్టీల మధ్య అంత సయోధ్య అయితే లేదు. దీనికి తోడు అన్నట్లుగా చూస్తే చిత్రాడలో గత నెలలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో నాగబాబు ఇండైరెక్ట్ గా వర్మ మీద చేసిన కామెంట్స్ నుంచే చిచ్చు మొదలైంది అని అంటున్నారు.
వర్మను పూర్తిగా పక్కన పెట్టే విధంగా జనసేన వ్యవహారం ఉందని టీడీపీ క్యాడర్ అయితే మండుతోంది. నాగబాబు తాజా టూర్ పుండు మీద కారం జల్లినట్టు ఉంది. నిజానికి చూస్తే పిఠాపురం సీటు అన్నది పవన్ కళ్యాణ్ ది ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. పైగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.
అలాంటి చోటనే కూటమి పార్టీల మధ్య విభేదాలు ఈ స్థాయిలో ఉండడం అది తారస్థాయిలో చేరడం నిజంగా ఏ విధంగా చూడాలి అన్న చర్చకు వచ్చింది. జనసేన టీడీపీల మధ్య సయోధ్యకు కృషి చేయాల్సిన పరిస్థితి ఉండగా ఇలా మరింతగా చిచ్చు రేగేలా వ్యవహారం సాగడంతో ఏమి జరుగుతోంది అన్నది అంతా ఆలోచిస్తున్నారు.
నాగబాబు టూర్ నే టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవాలని చూడడం ప్రతిగా జై జనసేన అని నినాదాలు ఇవ్వడంతో పిఠాపురంలో కూటమికి బీటలు వారినట్లే అని అంటున్నారు. వర్మ సైలెంట్ గా ఉన్నా ఆయనలో కూడా అసంతృప్తి ఎక్కువగానే ఉంది అని అంటున్నారు. పై స్థాయిలో చూస్తే కనుక చంద్రబాబు పవన్ ల మధ్యన మంచి సయోధ్య ఉంది.
అలాంటి వాతావరణం పిఠాపురంలో ఎందుకు నెలకొల్పలేకపోతున్నారు అన్నదే చర్చకు వస్తోంది. రాను రానూ ఈ విధంగా చేసుకుంటూ పోతే ఇంకా పరిస్థితి దిగజారుతుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే కనుక నాగబాబుపైన టీడీపీ తమ్ముళ్ళు ఆగ్రహంగా ఉన్నారు.
వారంతా వర్మను అవమానించడానికే నాగబాబు ఎమ్మెల్సీ కాగానే ఈ టూర్ పెట్టుకున్నారు అని అనుమానిస్తున్నారు. టీడీపీ వల్లనే జనసేన విజయం సాధ్యమైందని ఇపుడు తమ పార్టీనే అవమానిస్తారా అని వారు రగులుతున్నారు.
ఇక చూస్తే నాగబాబు స్టేట్ లెవెల్ ఫిగర్. ఆయన మంత్రి అవుతారని టాక్ నడుస్తోంది. అలాంటి ఆయన నియోజకవర్గానికి వచ్చినపుడు అందరికీ కలుపుకుని పోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అలా కాకుండా టీడీపీని సైడ్ చేస్తున్నారు అన్న భావం వారిలో కలిగేలా ఆయన పర్యటనలు కొనసాగాయని అంటున్నారు.
అంతే కాదు గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఈ పది నెలల కాలంలో తెచ్చుకుని ఇపుడు పీటముడి వేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది ఇప్పటికైనా మించిపోయింది లేదు పవన్ కళ్యాణ్ వర్మల మధ్య సయోధ్య కుదిరితే రెండు పార్టీల మధ్య కో ఆర్డినేషన్ అలాగే కొనసాగుతుందని అంటున్నారు. మరి ఆ దిశగా రెండు పార్టీల అధినాయకత్వాలు అడుగులు వేస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది.