కుప్పం పోలీసుల అదుపులో వైసీపీ నేత నాగార్జున... 41ఏ నోటీసులు?

ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో విమర్శలు శృతిమించుతున్న సంగతి తెలిసిందే. విజ్ఞత విడిచి, సంస్కారం మరిచి

Update: 2024-07-22 12:54 GMT

ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో విమర్శలు శృతిమించుతున్న సంగతి తెలిసిందే. విజ్ఞత విడిచి, సంస్కారం మరిచి.. ఉన్నత స్థానాల్లో ఉన్న నేతలను సైతం ఏకవచనంతో సంభోదించడమే కాకుండా, పరుష పదజాలంతో దూషించడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం కామన్ అయిపోయింది! దీనిపై ప్రభుత్వంలోని పెద్దలు నాడైనా, నేడైనా సీరియస్ గా రియాక్ట్ కాకపోతే.. ఈ దురలవాటు రేపటికి పాకే ప్రమాదం లేకపోలేదు!

అవును... రాజకీయాల్లో ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శల్లో హుందాతనం ఉండాలని అంటారు. అయితే ఇప్పుడు అది కనిపించడం చాలా అరుదైపోయింది. ఆ సంగతి అలా ఉంటే... ఇటీవల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ పై వైసీపీ నేత నాగార్జున యాదవ్.. కొరియర్ బాయ్, స్విగ్గీ బాయ్ అంటూ కామెంట్ చేశారు. దీనిపై పోలీసులకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.

ఈ సమయంలో... నాగార్జున యాదవ్ ని కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అదుపులోకి తీసుకున్నట్లు కొంతమంది చెబుతుండగా... కుప్పం పోలీస్ స్టేషన్ లో నమోదైన ఓ కేసులో భాగంగా అదుపులోకి తీసుకున్నారని మరొకరు అంటున్నారు. ఈ నేపథ్యంలో 41ఏ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది!

వాస్తవానికి నాగార్జున యాదవ్ గత కొంతకాలంగా తన వ్యాఖ్యలతో వివాదాల్లో ఉన్నారు. ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమత్రి అనే ఆలోచన కూడా లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో... నాగార్జున యాదవ్ పై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు నాగార్జునను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు... గతవారం హైకోర్టులో ఈయనపై ఉన్న ఓ కేసుకు సంబంధించి విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో... దీనికి సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని కుప్పం పోలీసులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో సీఎం చంద్రబాబుపై నాగార్జున అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ... చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో... నాగార్జున, హైకోర్టును ఆశ్రయించారు. 41ఏ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలే తప్ప అరెస్ట్ చేయడానికి వీలు లేదని కోర్టుకు విన్నవించారు. ఇదే సమయంలో పూర్తి వివరాలు సమర్పించడానికి జూలై 25వరకూ సమయం కావాలని కోరారు. దీంతో... ఈ విచారణను ఈనెల 25కి వాయిదా వేశారు న్యాయమూర్తి. దీంతో కుప్పం పోలీసులు నాగార్జునను అదుపులోకి తీసుకుంది ఏ కేసులో అనేది ఆసక్తిగా మారింది!

Tags:    

Similar News