కూటమి సర్కారుపై మేధావి.. 'నిందాస్తుతి'!
రాజకీయాల్లో కూడా నిందాస్తుతులు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటాయి.
నిందాస్తుతి.. అంటే పొగుడుతున్నట్టు కనిపిస్తారు. కానీ, తిడతారు. తిడుతున్నట్టు కనిపిస్తారు కానీ.. పొగు డుతారు. పొగుడుతున్నారో.. తిడుతున్నారో అర్ధం కానట్టుగా వ్యవహరించడమే నిందాస్తుతి. రాజకీయాల్లో కూడా నిందాస్తుతులు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. వైసీపీ హయాంలో కొందరు నాయకులు ఇలానే వ్యవహరించారు. అలాగని నేరుగా జగన్‌ను తిట్టరు. నేరుగా జగన్‌ను ప్రశంసించరు. కానీ, నిందాస్తుతి మాత్రం కొనసాగుతుంది. ఇలాంటి వారితో ఇబ్బంది ఏంటంటే.. ఎక్కువగా పాపులర్ కావడమే.
ఇప్పుడు ఈ సమస్య కూటమిసర్కారుకు కూడా ఏర్పడింది. మేధావిగా చెప్పుకొనే సీబీఐ మాజీ డైరెక్టర్ (ఇంచార్జ్) మన్నెం నాగేశ్వరరావు కూడా కూటమి ప్రభుత్వంపైనా, సీఎం చంద్రబాబుపైనా నిందాస్తుతి చేశారు. ప్రభుత్వాన్ని పొగుడుతున్నట్టే మాట్లాడుతూ.. విమర్శల వర్షం కురిపిస్తారు. విమర్శలు చేస్తూనే పొగడ్తలు కురిపించారు. డిసెంబరు 12వ తేదీకి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలు అవుతుంది. దీనిని పురస్కరించుకుని నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
``జగన్ హయాంలో అరాచకం జరిగిందని, అక్రమాలు జరిగాయని, భూదోపిడీ జరిగిందని.. మీరు(చంద్ర బాబు) పదే పదే చెప్పారు. బాగుంది. ప్రజలు కూడా నమ్మారు మిమ్మల్ని గద్దె నెక్కించారు. వచ్చే నెల 12వ తేదీకి మీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలు అవుతోంది. మరి ఎంత మందిపై చర్యలు తీసుకున్నారు? ఎంత భూమిని వెనక్కి తీసుకున్నారు.? ఎంత మందిని అరెస్టు చేశారు? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎంత వరకు నెరవేర్చారు?`` అని ప్రశ్నించారు.
దీనిని విమర్శలుగా తీసుకుంటే ఆవెంటనే నాగేశ్వరరావు.. మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. సోషల్ మీడియాలో దుర్భాషలను అరికట్టేందుకు మీరు తీసుకుంటున్న చర్యలు బాగానే ఉన్నాయని తెలిపారు. అంటే ఇది పొగడ్త. ఆ వెంటనే.. ఈ విషయంలో ఏకపక్షంగానే కేసులు పెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో టీడీపీ నాయకులు, ఇతర పార్టీల నాయకులు కూడా.. అనేక మందిని తీవ్రంగా విమర్శించారు. వీరి సంగతి ఏం చేస్తున్నారని నిలదీశారు.
కూటమిప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గడిచిన ఆరు మాసాల్లో ఏం చేశారో.. వైట్ పేపర్ విడుదల చేయాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అలా చేస్తే.. మీకే మంచిదని సూచించారు. అలా చేయకపోతే.. ఏమీ చేయలేదన్న అపఖ్యాతి వస్తుందని చెప్పారు. సూపర్ సిక్స్ పథకాల హామీలు మరిచిపోయారని ప్రజలు అనుకుంటున్నారని, వాటిని ఎంత వరకు నెరవేర్చారో.. ఏం చేశారో కూడా.. చెప్పాలన్నారు. ఈ క్రమంలో విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు పట్ల అనేక మందికి గౌరవం ఉందని.. అలానే తనకు కూడా ఉందన్నారు. మొత్తానికి ఈ నిందాస్తుతి రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. దీనిపై కూటమి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.