ఎండల మీద మాట మడత.. ఐఎండీ మరీ ఇంత అధ్వానమా?
మహారాష్ట్రలోని ప్రముఖ నగరం నాగ్‌పుర్ లో గురువారం 56 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఇది ప్రపంచ గరిష్ఠ ఉష్ణోగ్రతకు కేవలం ఒక డిగ్రీనే తక్కువ కావడం గమనార్హం.
ఉత్తరాది దక్షిణాది అని తేడాలేదు.. పశ్చిమం దక్షిణం అని వ్యత్యాసం లేదు.. ఓవైపు దేశంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రజలు పిట్టల్లా రాలిపోవడం అంటే ఏమిటో తెలిసి వస్తోంది. ఉష్ణోగ్రతలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. మహారాష్ట్రలోని ప్రముఖ నగరం నాగ్‌పుర్ లో గురువారం 56 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఇది ప్రపంచ గరిష్ఠ ఉష్ణోగ్రతకు కేవలం ఒక డిగ్రీనే తక్కువ కావడం గమనార్హం. దీన్ని తలచుకుని.. ప్రజలు అమ్మో అనుకున్నారు. బయటకు రావాలంటేనే వణికిపోయారు. అయితే, ఇంతలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మాట మార్చింది.. ఉష్ణోగ్రతను నమోదు చేసే సెన్సర్ సరిగా పనిచేయడం లేదంటూ స్పష్టత ఇచ్చింది.
ఒకచోట 54.. మరోచోట ౫౬ వాస్తవానికి నాగపూర్ దేశంలో ప్రధాన నగరమే. ఇలాంటిచోట వాతావరణ విభాగం నాలుగు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఏర్పాటు చేసింది. రెండు స్టేషన్లలో గురువారం ఉష్ణోగ్రతలు భారీగా చూపించాయి. సోనేగావ్ స్టేషన్ లో 54 డిగ్రీలు, ఉత్తర అంబాజరీ రోడ్డులోని ఐఎండీ కేంద్రంలో రికార్డు స్థాయిలో 56 డిగ్రీలు నమోదైంది. కానీ, రెండుచోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రతనే చూపింది. అయితే, 56 డిగ్రీల ఉష్ణోగ్రత దేశమంతా వైరల్ గా మారింది.
అబ్బే అదేం లేదు..
నాగపూర్ నిప్పు కణికగా మారిందన్న కథనాలతో వాతావరణ శాఖ మేల్కొంది. 56 డిగ్రీల ఉష్ణోగ్రత నిజం కాదని.. దానిని ధ్రువీకరించట్లేదని పేర్కొంది. నాగపూర్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం స్టేషన్‌లో ఉష్ణోగ్రతలు నమోదయ్యే సెన్సర్ సరిగా పని చేయడం లేదని.. మరమ్మతు చేయిస్తున్నామని తెలిపింది. ఒక్కోసారి అత్యంత ప్రతికూల వాతావరణంలోనూ సెన్సర్లు తప్పుడు రికార్డులు చూపుతాయని చెప్పింది. ఇలాంటి సమయంలో సమీపంలోని మరో స్టేషన్ లో నమోదైన రికార్డులతో సరిపోల్చుకుంటామని వివరించింది. నాగపూర్‌లో 56, 54 డిగ్రీలు సెన్సర్ల తప్పిదం వల్లే నమోదయ్యాయని తెలిపింది.
ఢిల్లీలోనూ ఇలా..గత వారం దేశ రాజధాని ఢిల్లీ ముంగేష్ పూర్ లో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వార్తలు వచ్చాయి. అంతముందు రోజుల్లో రాజస్థాన్ లోని చురులో 50 డిగ్రీల పైనే రికార్డయినట్లు పేర్కొంది. కానీ, ఢిల్లీ టెంపరేచర్ పై ఐఎండీ వెంటనే స్పందించింది. 52.9 డిగ్రీలు నమోదైన స్టేషన్ లోని సెన్సర్ సరిగా పనిచేస్తుందో, లేదో తనిఖీ చేస్తున్నట్లు తెలిపింది. అయితే, నాగపూర్ లోనూ తప్పుడు ఉష్ణోగ్రతలు నమోదుతో వాతావరణ శాఖ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల పనితీరుపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.