రేవంత్ ను సమున్నతంగా నిలిపిన నల్లగొండ గద్దర్ పాట!
''మూడు రంగుల జెండా పట్టి.. సింగమోలే కదిలినాడు'' అంటూ రేవంత్ ను గొప్పగా పైకెత్తిన ఆ గళం నల్లగొండ గద్దర్ ది
తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరికి వారే నాయకులు.. ముఖ్య నాయకుల్లో ఎవరికి వారే ముఖ్యమంత్రి పదవికి పోటీదారులు.. ఇందులో తప్పుబట్టాల్సిందేమీ లేదు.. కాంగ్రెస్ అంటేనే వాక్ స్వాతంత్ర్యం ఎక్కువగా ఉండే పార్టీ. అదొక మహా సముద్రం. దానిని ఈదుకుంటూ ముందుకుసాగడం నాయకులకు ఉండాల్సిన లక్షణం.. మరి.. ఇలాంటి నాయకులను వెనక్కులాగేవారూ ఉంటారు. ఇక రాజకీయాల్లో సొంత పార్టీలో అనే కాదు.. ప్రత్యర్థులనూ మించి ఎదగాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆ నాయకుడి గొప్పదనం, ప్రత్యేకతను ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుంది. సరిగ్గా ఇదే జరిగింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విషయంలో.
భగభగ మండే నిప్పుల దండై
తెలంగాణ ఎన్నికల సందర్భంగా రేవంత్ ప్రచార సభలకు ముందుగా వినిపించినది.. సోషల్ మీడియాలో హోరెత్తినది.. ఒకటే పాట.. రేవంత్ అభిమానులంతా హుషారుగా పాడుకున్న పాట.. వాట్సప్ స్టేటస్ గా, ఇన్ స్టా గ్రామ్ రీల్స్ గా ఉంచిన పాట.. ''భగభగ మండే నిప్పుల దండై''. రేవంత్ ను కీర్తిస్తూ.. కాంగ్రెస్ జెండాను పట్టుకున్న వైనాన్ని కొనియాడుతూ సాగిన ఈ పాట పాడిన విధానం సాధారణ ప్రజలనూ ఆకట్టుకుంది.
ఆ గొంతు.. గద్దర్ ను పోలి ఉంటుంది
''మూడు రంగుల జెండా పట్టి.. సింగమోలే కదిలినాడు'' అంటూ రేవంత్ ను గొప్పగా పైకెత్తిన ఆ గళం నల్లగొండ గద్దర్ ది. ప్రజా గాయకుడు గద్దర్ ను పోలి ఉండే ఆ గళం ఇప్పుడు తెలంగాణలోనే కాదు ఏపీలోనూ మార్మోగతున్నది. రేవంత్ మీదనే కాక జన సేన అధినేత పవన్ కల్యాణ్ పైనా నల్లగొండ గద్దర్ పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది. కాగా, మిగతావారి సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణ ఎన్నికల సందర్భంగా రేవంత్ ను ఆకాశానికెత్తింది మాత్రం నల్లగొండ గద్దర్ పాటనే. గమనార్హం ఏమంటే.. ఇప్పుడు నల్లగొండ గద్దర్ గా అందరికీ సుపరిచితుడైన ఆయన ఒకప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కారు డ్రైవర్. బాల్యం నుంచే గద్దర్ పాటలను టేప్ రికార్డర్ లో వింటూ పెరిగిన ఆయన ఆ ప్రభావంతోనే పాటగాడయ్యారు. చిన్నప్పటి నుంచి గద్దర్ తరహా గళంతో పాడుతుండడంతో ఆయనకు నల్లగొండ గద్దర్ గా పేరొచ్చింది. కాగా, ఆయన పాటల్లో 'మూడు రంగుల జెండా పట్టి..' పాట అత్యంత ఆదరణ పొందింది. 3:40 నిమిషాల నిడివి ఉన్న ఈ పాటను నల్లగొండ జిల్లాకే చెందిన సినీ సంగీత దర్శకుడు, గేయ రచయిత చరణ్ అర్జున్ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక పర్యటించిన ప్రతీచోటా ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఖమ్మం బహిరంగసభలో ప్రియాంక గాంధీ ఈ పాటకు చప్పట్లు చరుస్తూ ప్రజలను ఉత్సాహపరుస్తూ డ్యాన్స్ చేశారు. తెలంగాణలోనే కాదు ఏపీలోనూ యువత ఈ పాటను కాలర్ ట్యూన్లుగా పెట్టుకోవడం విశేషం. నల్లగొండ జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి... పాట గాయకుడు నల్గొండ గద్దర్ నర్సన్న స్వగ్రామం గుండ్రపల్లికి వెళ్లి ఈ పాట గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నల్లగొండ గద్దర్ కు సముచిత స్థానం దక్కుతుందని అందరూ భావిస్తున్నారు.