90 గంటల పని.. భారత్ పే సీఈవో కీలక వ్యాఖ్యలు
తాజాగా భారత్ పే సీఈవో నలిన్ నెగీ తన అభిప్రాయం వెల్లడించారు.
ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్ అంట్ టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలపై పారిశ్రామిక వర్గాల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ అంశంపై పారిశ్రామిక వేత్తలు ఆనంద్ మహీంద్ర, అదర్ పూనావాలా వంటి ప్రముఖులు ఇప్పటికే స్పందించగా, తాజాగా భారత్ పే సీఈవో నలిన్ నెగీ తన అభిప్రాయం వెల్లడించారు. ఉద్యోగులు ఎంత సమయం పనిచేశారనే విషయం కంటే నాణ్యమైన ఉత్పాదకత ముఖ్యమని నలిన్ నెగీ అభిప్రాయపడ్డారు.
‘‘వారానికి 90 గంటల పని అంటే చాలా కష్టం. ఎన్ని గంటలు పని చేశామనే దానింటే, ఉత్పాదకత, నాణ్యత ముఖ్యమని నా అభిప్రాయం. మా సంస్థ ప్రారంభించి ఆరేళ్లు పూర్తయింది. భారత్ పే ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండే కంపెనీగా నిలవాలన్నదే మా అభిమతం. ఒక కంపెనీ ఉద్యోగాలు ఇవ్వడం మాత్రమే కాదు. ప్రజలకు మంచి భవిష్యత్ ఇచ్చేదిగా ఉండాలన్నదే మా ఆలోచన. ప్రస్తుతం ఈ విషయంపైనే ఫోకస్ చేస్తున్నాం’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
వారానికి 90 గంటల పనిపై నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఉద్యోగి సంతోషంగా ఉంటేనే సంస్థకు లాభం ఉంటుంది. బాగా పనిచేయాలని ఉద్యోగులు అనుకుంటే చాలు. వేరొకరి ప్రోద్బలం అవసరం లేదని భారత్ పే సీఈవో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంట్లో కూర్చొని ఎంతసేపు భార్యను చూస్తారంటూ ఇటీవల ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అవసరమైతే ఆదివారాలు ఉద్యోగులు పనిచేయాలన్న సుబ్రహ్మణ్యన్ సూచనలపై దేశవ్యాప్తంగా ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘాలు, వ్యాపార వేత్తలు కూడా ఆయన సూచనను విమర్శిస్తున్నాయి. ఇదే సమయంలో అసాధారణ ఫలితాల కోసం అసాధారణ కృషి అవసరమంటూ ఎల్ అంట్ టీ సంస్థ తమ చైర్మన్ వ్యాఖ్యలను సమర్థించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో స్పందించిన భారత్ పే సీఈవో నలిన్ నెగీ ఎల్అండ్ టీ చైర్మన్ వ్యాఖ్యలను పరోక్షంగా తప్పుబట్టారు.