కమల కిరణాలు : ఏపీ బీజేపీ చీఫ్ గా నల్లారి ?
పైగా ఇపుడు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు ప్రక్రియ సాగుతోంది. దీని తరువాత కొత్త అధ్యక్షుడు నియామకం ఉంటుంది అని అంటున్నారు.
ఏపీ బీజేపీ కొత్త చీఫ్ ఎవరు అన్న చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆ పదవిలో ప్రస్తుతం ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి పదవీ కాలం తొందరలో పూర్తి కావస్తోంది. ఆమె 2022లో ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. బీజేపీలో అధ్యక్ష పదవీ కాలం రెండేళ్ళు మాత్రమే.
పైగా ఇపుడు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు ప్రక్రియ సాగుతోంది. దీని తరువాత కొత్త అధ్యక్షుడు నియామకం ఉంటుంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీ బీజేపీ చీఫ్ గా ఎవరిని నియమిస్తారు అన్నది పాయింట్. ఉమ్మడి ఏపీ రెండుగా విభజించిన తరువాత సుదీర్ఘ కాలం కంభంపాటి హరిబాబు చీఫ్ గా వ్యవహరించారు. ఆ తరువాత మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణకు చాన్స్ ఇచ్చారు. ఆయన అనంతరం సోము వీర్రాజుకు పగ్గాలు ఇచ్చారు.
ఆయన నుంచి దగ్గుబాటి పురంధేశ్వరికి అవకాశం దక్కింది. ఇలా చూసుకుంటే మొత్తం నలుగురు ఏపీ బీజేపీ అధ్యక్షులుగా పనిచేస్తే ఆ నలుగురూ కోస్తాకు చెందిన వారే కావడం విశేషం. పైగా ఇద్దరు కమ్మ, ఇద్దరు కాపులకు బీజేపీ అవకాశం ఇచ్చినట్లు అయింది. అలా సామాజిక ప్రాంతీయ సమతూకం పాటించిన బీజేపీ విభజన ఏపీలో తొలిసారిగా ఒక బలమైన సామాజిక వర్గం వైసీపీకి గట్టి పట్టు ఉందని భావిస్తున్న రాయలసీమ నుంచి ఒక కీలక నేతను తెచ్చి కొత్త అధ్యక్షుడిని చేయాలని చూస్తోంది అని అంటున్నారు.
ఆయన ఎవరో కాదు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఏపీకి చివరి సీఎం గా వ్యవహరించిన నల్లారి వారు బీజేపీలో చేరగానే చాలా అవకాశాలు ఆ పార్టీ ఇచ్చింది. ఆయనను పార్టీ జాతీయ కీలక నేతగా భావిస్తోంది ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజంపేట నుంచి నల్లారి లోక్ సభకు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆయన కనుక గెలిచి ఉంటే కచ్చితంగా కేంద్ర మంత్రి అయి ఉండేవారు.
ఇపుడు ఆయనకు మరో అవకాశంగా బీజేపీ అధ్యక్ష పదవిని ఇస్తున్నారు అని అంటున్నారు. ఉమ్మడి ఏపీలో ఇంద్రసేనారెడ్డి, జి కిషన్ రెడ్డి వంటి వారు బీజేపీ ప్రెసిడెంట్లుగా పనిచేశారు. కానీ విభజన ఏపీలో మొదటి రెడ్డిగా బీజేపీ పగ్గాలు అందుకోబోతున్నది మాత్రం నల్లారి వారే అని చెప్పాలి.
ఆయన కాంగ్రెస్ లో అనేక పదవులు చేపట్టారు, ఇపుడు ఆయనకు ఏపీ బీజేపీని లీడ్ చేసే చాన్స్ దక్కబోతోంది అని అంటున్నారు. నల్లారి ద్వారా రాయలసీమలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించాలని తద్వారా ఏపీలో బలం పుంజుకోవాలని బీజేపీ చూస్తోంది అని అంటున్నారు
అదే సమయంలో చూస్తే టీడీపీ కూటమి ఏపీలో అధికారంలో ఉంది. టీడీపీకి కమ్మలు విధేయత చూపిస్తారు. కాపులు జనసేన వైపు ట్రావెల్ అవుతున్నారు. దాంతో బీజేపీ రెడ్డి సామాజిక వర్గం మీద గురి పెట్టిందని అందుకే బెస్ట్ చాయిస్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ని ముందు పెట్టి ఏపీలో కమల కిరణాలను గట్టిగా అంతటా ప్రసరింపచేయాలని వ్యూహ రచన చేస్తోంది అని అంటున్నారు.
ఏపీలో రెడ్లు ఇపుడు ఆలోచనలో పడ్డారు అని అంటున్నారు. వైసీపీని నమ్ముకుని ఉండలేక అలాగని కాంగ్రెస్ లో చేరలేక టీడీపీలో చోటు లేక వారు ఏమి చేయాలో పాలు పోని స్థితిలో ఉన్నారని అంటున్నారు. దాంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వారిని ఆకట్టుకుంటే ఏపీలో బలమైన పార్టీగా మారేందుకు ఆస్కారం ఉంటుందని అలాగే ఒకనాటి కాంగ్రెస్ మాదిరిగా తమ పార్టీలో కూడా రెడ్లకు సముచితమైన స్థానాన్ని కల్పిస్తామని చెప్పడమే బీజేపీ ఆలోచన అని అంటున్నారు.
ఇక కిరణ్ కుమార్ రెడ్డికి ఈ పదవి ఇస్తున్నారని ముందే ఆయనకు తెలుసు కాబట్టి ఇప్పటి నుంచే వైసీపీ నేతలను ఆయన ఆకట్టుకునే పనిలో పడ్డారు అని అంటున్నారు. కొంతమంది నేతలతో ఆయన మంతనాలు సాగిస్తున్నారు అని అంటున్నారు. బీజేపీలోకి వస్తే తగిన గౌరవం ఇస్తామని కూడా వైసీపీ నేతలకు కిరణ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి మీద ఎంతో ఆశతో పెద్ద బాధ్యతలనే పార్టీ పెట్టబోతోంది అని అంటున్నారు. మరి దానిని కిరణ్ కుమార్ రెడ్డి ఎంత మేరకు నెరవేరుస్తారు అన్నది చూడాల్సి ఉంది.