కెప్టెన్‌ కిరణ్‌ ఏం చేయబోతున్నారు?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చిట్టచివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి

Update: 2023-08-23 07:58 GMT

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చిట్టచివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ బీజేపీ కోసం పార్టీలో చేరారా? లేక ఏపీ బీజేపీ కోసం పార్టీలో చేరారా అనేదానిపై చర్చ జరిగింది. బీజేపీ ఏ ఉద్దేశంతో ఆయనను పార్టీలో చేర్చుకుందనే కామెంట్లు వినిపించాయి.

పార్టీలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి చేరిక సందర్భంగా కేంద్ర బీజేపీ నేతలు ఆయన ప్రభావం ఏపీతోపాటు తెలంగాణలోనూ ఉంటుందని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డిని ఉపయోగించుకుని గతంలో కాంగ్రెస్‌ లో కీలక పాత్ర పోషించిన నాయకులను చేర్చుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ ఉందని అంటున్నారు.

ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న తన సహచరులను బీజేపీలోకి చేర్చుకుని తనకంటూ ఒక గుర్తింపును, ప్రాభవాన్ని నిరూపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని టాక్‌ నడుస్తోంది.

ఇందులో భాగంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజును కిరణ్‌ సంప్రదించారని చెబుతున్నారు. ఆయనను బీజేపీలోకి తీసుకురావాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇరువురు నేతలు న్యూఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో సమావేశమై చర్చించారని అంటున్నారు.

ఆంద్రప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ తన ప్రతాపాన్ని పూర్తిగా కోల్పోయిన తర్వాత పల్లంరాజు గత కొంతకాలంగా స్తబ్దుగా ఉంటున్నారు. చాలా కాలం క్రితమే ఆయనకు బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చినా పార్టీ పట్ల ఉన్న విధేయత కారణంగా మరే పార్టీలో చేరలేదు.

ఈ కారణంతోనే ఇటీవల పల్లం రాజుకు కాంగ్రెస్‌ పార్టీ తన అత్యున్నత విధాన నిర్ణాయక విభాగమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)లో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. అయితే ఈ పదవిపై పళ్లంరాజు పెద్ద ఆసక్తిగా లేరని అంటున్నారు.

గతంలో దగ్గుబాటి పురందేశ్వరి, కావూరి సాంబశివరావు వంటి కాంగ్రెస్‌ నేతలు బీజేపీలోకి ఫిరాయించినప్పటికీ పల్లంరాజు కాంగ్రెస్‌లోనే కొనసాగేందుకు మొగ్గు చూపారు. అయితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేనతో పొత్తు ద్వారా రాష్ట్రంలో బీజేపీ కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, అందువల్ల బీజేపీలో చేరేలా పల్లంరాజును కిరణ్‌ ఒప్పించినట్లు ప్రచారం జరుగుతోంది.

అందులోనూ పల్లం రాజు కాపు నాయకుడు కావడం, వచ్చే ఎన్నికల్లో కాపు ఓట్లు పోలరైజ్‌ అయ్యే అవకాశం ఉన్నందున ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని కిరణ్‌ చెప్పినట్టు తెలుస్తోంది.

మరోవైపు విశాఖలో ఆగస్టు 23న జరిగే బీజేపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. దీనికి హాజరయ్యేందుకు కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఒక రోజు ముందుగానే విశాఖపట్నం వచ్చారు. ప్రస్తుతం జనసేన పార్టీతో పొత్తులో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ కొన్ని సీట్లయినా దక్కించుకోవాలని ఆశపడుతోంది.

ఇందులో భాగంగా రాయలసీమకు చెందిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పైన బీజేపీ పెద్ద ఆశలు పెట్టుకుందని అంటున్నారు. ప్రాంతీయ సమీకరణాలు, రాజకీయ సమీకరణాలను ఆధారంగా చేసుకుని కిరణ్‌ బీజేపీకి లాభం చేకూరుస్తారని బీజేపీ అధిష్టానం ఆశిస్తోంది.

అదేసమయంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో చీఫ్‌ విప్‌ గా, స్పీకర్‌ గా ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలిగిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి సైతం బీజేపీ తన రాజకీయ రీ ఎంట్రీకి లాంచింగ్‌ ప్యాడుగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News