పెద్దిరెడ్డి ఫ్యామిలీ టార్గెట్ : రాజంపేట నుంచి ఎంపీగా కిరణ్....?

ఇక ఈసారి ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రాజంపేట ఎంపీ సీటు నే గురి పెట్టారని అంటున్నారు

Update: 2023-09-28 03:59 GMT

కాంగ్రెస్ లో రెండు సార్లు చేరిక మళ్లీ బయటకు రావడం ఆ మీదట బీజేపీలో చేరడం ఇలా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ జీవితం గత తొమ్మిదేళ్ళుగా ఎటూ కాకుండా పోయింది అని అంటారు. అయితే ఆయన ఇపుడు బీజేపీలో చేరడం ద్వారా ఫ్యూచర్ పాలిటిక్స్ ని చూస్తున్నారు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ టీడీపీల మధ్య పొత్తు ఉంటుందన్న నమ్మకంతో ఆయన ఈసారి రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తారు అని అంటున్నారు.

ఇక కిరణ్ కుమార్ రెడ్డి 2009లో పీలేరు నుంచి పోటీ చేసి మొదట స్పీకర్ తరువాత ఏకంగా సీఎం అయిపోయారు. ఆ తరువాత ఆయన 2014లో పోటీ చేయలేదు, 2019 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అంటే ఆయన 2024లో పోటీ చేస్తే కనుక పదిహేనేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత పోటీ చేస్తున్నట్లు అవుతుంది అని అంటున్నారు.

ఇక ఈసారి ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రాజంపేట ఎంపీ సీటు నే గురి పెట్టారని అంటున్నారు. దానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ ది పెద్దిరెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేయడం. అక్కడ నుంచి రెండు సార్లు ఎంపీగా వైసీపీ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిధున్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. 2024 ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేస్తారు అని అంటున్నారు.

ఆయన్ని ఓడించాలన్నది కిరణ్ పంతంగా ఉంది అంటున్నారు. అలా పెద్దిరెడ్డి మీద డైరెక్ట్ గా రివెంజ్ తీర్చుకోవచ్చు అని భావిస్తున్నారుట. మరో వైపు చూస్తే రాజంపేట పరిధిలో కిరణ్ కి ఎంతో కొంత బలం ఉన్న అసెంబ్లీ సీట్లు ఉన్నాయనే అంటున్నారు. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రైల్వే కోడూరు, తంబళ్లపల్లి, పీలేరు, పుంగనూరు, మదనపల్లె, రాజంపేట, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

వీటిలో పీలేరులో కిరణ్ కి బాగానే పట్టు ఉంది. తమ్ముడు కిశోర్ కుమార్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. ఆయనే 2024లో ఎమ్మెల్యేగా పోటీకి దిగుతారు. పొత్తులు ఉంటే ఆ ఓట్లు అన్నకే పడతాయి. అలాగే మిగిలిన చోట్ల తన పలుకుబడితో ఓట్లు వస్తాయని ఆశిస్తున్నారు.

అయితే రాజంపేట సీటుని గెలవడం అంత సులువు అయితే కాదు, వైసీపీకి గట్టి పట్టుంది. జనసేన టీడీపీ బీజేపీ కలసినా 2014లోనే ఇక్కడ వైసీపీ గెలిచింది. ఇపుడు ఎటూ వైసీపీ అధికారంలో ఉంది. పైగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఉక్కు పిడికిలితో రాజకీయం నడుపుతారు. కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు దాకా హైదరాబాద్ వదిలి రావడంలేదు. ఇపుడు ఆయన పాత పరిచయాలను బయటకు తీస్తున్నారు కానీ అవి ఎంతవరకూ వర్కౌట్ అవుతాయో తెలియవు అంటున్నారు.

ఏది ఏమైనా రాజంపేట ఎంపీ సీటును పొత్తులో భాగంగా టీడీపీ కేటాయిస్తుంది. దాంతో జనసేన పొత్తు ఉంటే బలిజ సామాజికవర్గం అండ కూడా ఉంటుందని నమ్ముతున్నారు. సో కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ దశ తిరగాలని చాలానే చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన హిట్ అయితే బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అవుతారు అని అంటున్నారు ఆయన అనుచరులు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News