తిరుమలలో మరో సంస్కరణ.. ఉద్యోగులకు 'నేమ్ బ్యాడ్జ్'లు
తిరుమల తిరుపతి దేవస్థానంలో సంస్కరణలు పరుగులు పెడుతున్నాయి. పాలక మండలి చైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అనేక రూపాల్లో సంచలన మార్పులు తీసుకువస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో సంస్కరణలు పరుగులు పెడుతున్నాయి. పాలక మండలి చైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అనేక రూపాల్లో సంచలన మార్పులు తీసుకువస్తున్నారు. ఇప్పటికే రాజకీయ నేతలు తిరుమలపై చేసే ప్రసంగాలను అడ్డుకున్నారు. అదేవిధంగా సాధారణ భక్తులకు పెద్ద పీట వేస్తూ.. త్వరితగతిన దర్శనం అయ్యేలా నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా తిరుమల, తిరుపతిలో నివసించే స్థానికులకు ప్రత్యేక టోకెన్ ద్వారా దర్శనాలు కల్పిస్తున్నారు.
అదేవిధంగా శ్రీవాణి ట్రస్టు నిధుల విషయంలో దుర్వినియోగం కాకుండా చూస్తున్నారు. ఇక, తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో విధులు నిర్వహించే ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. టీటీడీ స్టాఫ్ మొత్తానికీ వారి వారి పేర్లతో బ్యాడ్జ్‌లను అందించనున్నారు. తద్వారా.. ఉద్యోగులను గుర్తించడం వీలవుతుందని ఆయన భావిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా బీఆర్ నాయుడు.. ఎక్స్‌లో వెల్లడించారు. ఇలా చేయడం ద్వారా భక్తులతో కఠినంగా వ్యవహరించే సిబ్బందిని గుర్తించేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు.
``టీటీడీ సిబ్బంది మొత్తానికీ వారి పేరుతో కూడిన బ్యాడ్జీలను అందించాలని భావిస్తున్నాం. దీనికి కారణం .. ఇటీవల కొందరు సిబ్బంది.. భక్తులతో అనుచితంగా ప్రవర్తించినట్టు మా దృష్టికి వచ్చింది. అందుకే ఈవిధానం తీసుకువస్తున్నాం. భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించే సిబ్బంది విషయంలో ఏమాత్రం నేను ఉపేక్షించేది లేదు`` అని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
ఉద్యోగులు, సిబ్బందికి నేమ్ బ్యాడ్జ్‌లు ఇవ్వడం ద్వారా.. దురుసుగా ప్రవర్తించేవారిని గుర్తించడం సులభమవుతుందని నాయుడు పేర్కొన్నారు. ఈ నూతన విధానం ద్వారా ఉద్యోగులు, సిబ్బందిలో విధుల పట్ల బాధ్యతను పెంచేందుకు అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. భక్తులకు మరింత సేవ చేసేందుకు వారికి అవకాశం కూడా కల్పించినట్టు అవుతుందన్నారు. కాగా.. బీఆర్ నాయుడు ప్రకటన పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.