రాజ్యసభకు నందమూరి సుహాసిని ?
ఇపుడు సడెన్ గా ఈ సీటు విషయంలో దివంగత నాయకుడు హరిక్రిష్ణ ఏకైక కుమార్తె నందమూరి సుహాసిని పేరు తెర మీదకు వస్తోంది.
ఏపీ నుంచి రాజ్యసభకు ఖాళీ అయ్యే మూడు సీట్లకు గాను తొందరలో నోటిఫికేషన్ రానుంది. దీంతో ఈ సీట్లకు సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలన్న దాని మీద టీడీపీ అధినేత చంద్రబాబు అనేక రకాలుగా కసరత్తు చేస్తున్నారు అని అంటున్నారు.
రాజ్యసభలో ఈ రోజుకు చూస్తే టీడీపీకి ఒక్క మెంబర్ కూడా లేరు. వైసీపీ నుంచి మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు అలాగే ఆర్ క్రిష్ణయ్య రాజీనామా చేయడంలో ఈ సీట్లు ఖాళీ అయ్యాయి. ఇక మోపిదేవి, బీద మస్తాన్ రావు ఇద్దరూ రీసెంట్ గా టీడీపీలో చేరారు.
వారికి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా మంచి అవకాశాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలుస్తోంది. అదే విధంగా ఆర్ క్రిష్ణయ్య బీజేపీలో చేరుతారని అంటున్నారు. మరి ఆయన కోటాలో ఎవరికి సీటు ఇస్తారు అన్నది చూడాల్సి ఉంది. అయితే ఈ మూడు సీట్లలో రెండు టీడీపీ తీసుకుని ఒకదానిని జనసేనకు ఇస్తుందని చర్చ సాగుతోంది.
ఆ రెండింటి విషయంలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు కనుక రాజ్యసభ సీటు ఇస్తే అనుభవం కలిగిన వారు పెద్దల సభలో ఉంటారు అని కేంద్ర ప్రభుత్వంలో మంచి సంబంధాలు ఉంటాయని అవసరమైన సాయం కూడా కేంద్రం నుంచి అందుతుందని దానికి కావాల్సిన చొరవ ప్రోత్సాహం గల్లా జయదేవ్ వంటి వారు అందిస్తారు అని చంద్రబాబు అంచనా కడుతున్నారు.
అదే విధంగా రెండవ సీటు కూడా మరో కీలక నేతకు ఇస్తారని ప్రచారంలో ఉంది. ఇపుడు సడెన్ గా ఈ సీటు విషయంలో దివంగత నాయకుడు హరిక్రిష్ణ ఏకైక కుమార్తె నందమూరి సుహాసిని పేరు తెర మీదకు వస్తోంది.
ఆమెను రాజ్యసభకు పంపాలని చంద్రబాబు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. సుహాసిని టీడీపీలో గత ఆరేళ్ళుగా పనిచేస్తున్నారు. ఆమె 2018లో తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున కూకట్ పల్లి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.
ఇక ఏపీలో టీడీపీ కూటమి విజయం కోసం గత ఎన్నికల్లో ఆమె తన వంతుగా పనిచేశారు. తెలంగాణాలో టీడీపీని మళ్ళీ పైకి లేపే ఆలోచనలో ఉన్న చంద్రబాబు నందమూరి కుటుంబం నుంచి ఒకరిని రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందని ఆ విధంగా పార్టీని కూడా విస్తరించుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
అంతే కాదు సుహాసిని ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ని కూడా భవిష్యత్తులో టీడీపీ వైపు తిప్పుకుని మొత్తం నారా నందమూరి ఫ్యామిలీ ఒకటి అన్నది చాటాలని భావిస్తున్నారు అని అంటున్నారు. ఈ విధంగా బాబు అలోచనలు సాగుతున్నాయని చెబుతున్నారు.
ఇంకో వైపు చూస్తే నందమూరి సుహాసినిని కనుక ఎంపిక చేయకపోతే ఒక సీటుని బీసీలకు ఇవ్వాలని డిమాండ్ వచ్చిన పక్షంలో సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడిని రాజ్యసభకు పంపిస్తారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే నందమూరి సుహాసినిని ఎంపిక చేసే అవకాశాలే అధికంగా ఉంటున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.