వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్టు.. ఎందుకు? ఎక్కడ?

బాపట్ల మాజీ ఎంపీ.. వైసీపీ నేత నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2024-09-05 04:56 GMT

బాపట్ల మాజీ ఎంపీ.. వైసీపీ నేత నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో దాక్కున్న ఆయన్ను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉదంతంలో సురేష్ తో పాటు నిందితులుగా ఉన్న వైసీపీ నేతలంతా అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. వీరిలో లేళ్ల అప్పిరెడ్డి.. దేవినేని అవినాష్.. తలశిల రఘురామ్ ల కోసం గుంటూరు., బాపట్ల, పల్నాలు జిల్లా పోలీసులతో కలిపి మొత్తం 12 టీంలను ఏర్పాటు చేశారు.

ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయన్నుఅరెస్టు చేసేందుకు ఉద్దండరాయునిపాలెంలోని ఆయన ఇంటికి వెళ్లారు. కానీ.. ఆయన అక్కడ లేరు. అరెస్టు భయంతో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్లుగా గుర్తించిన పోలీసులు.. ఆయన్ను ఫోన్ లో కాంటాక్టు చేసేందుకు ప్రయత్నించినా.. ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది. దీంతో అక్కడే కాసేపు వెయిట్ చేసిన పోలీసులు వెనుదిరిగారు.

అనంతరం.. నందిగం సురేష్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం ఉదయం నుంచి ఆయన ఎక్కడ ఉన్నారన్న విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం లభించింది. దీంతో.. ప్రత్యేక బలగాలు హైదరాబాద్ కు వెళ్లి.. ఆయన్ను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఆయన అరెస్టును పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ప్రాథమిక విచారణకు ముందే అరెస్టు ప్రకటిస్తారా? కాస్త ఆగి ప్రకటిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

Tags:    

Similar News