మహిళ హత్యకేసు... వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ కు షాక్!
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను సోమవారం కస్టడీ ముగిసిన తర్వాత పోలీసులు మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సమయంలో సురేష్ కు మరో 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఇందులో భాగంగా... నవంబర్ 4 వరకూ ఆయన గుంటూరు జైల్లో ఉండనున్నారు!
అవును... వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు సోమవారం.. మరో 14 రోజుల రిమాండ్ విధించారు. వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హత్య కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు నవంబర్ 4 వరకూ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో... పోలీసులు సురేష్ ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
కాగా... 2020లో తుళ్లూరు మండలం వెలగపూడిలో జరిగిన ఓ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను నిందితుడిగా చేర్చుతూ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో పీటీ వారెంట్ కూడా జారీ చేశారని అంటున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులోనూ సురేష్ నిందితుడిగా ఉన్నారు!
తుళ్లూరు మండలం, వెలగపూడికి చెందిన మరియమ్మ అనే మహిళ 2020లో నాటి వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తనకు పెన్షన్ నిలివేశారని, ఇంటి స్థలం ఇవ్వలేదని ఆరోపిస్తూ జగన్ నూ దూషించారు. దీంతో... నందిగం సురేష్ అనుచరులు ఆమె ఇంటిపై దాడికి ప్రయత్నించారు!!
ఈ ఘర్షణల నేపథ్యంలో మరియమ్మపై దాడి జరిగిందని.. ఆ దాడిలో ఆమె మరణించిందని ఆమె కుమారుడు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాస్తవానికి నాడే తాను ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదని అతడు చెప్పుకొచ్చాడు.