సీఎం సెక్యూరిటీ ఆఫీసర్‌ మరదలకు ఆ సీటు!

ఆయన స్థానంలో సీఎం వైఎస్‌ జగన్‌ వ్యక్తిగత భద్రతా అధికారి జోషి మరదలు అమర్లపూడి కీర్తి సౌజన్యను బరిలోకి దించుతారని చెబుతున్నారు.

Update: 2024-01-20 07:18 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ నాలుగు విడతల్లో ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించింది. మరో కొద్ది రోజుల్లో ఐదో విడత జాబితాను విడుదల చేయొచ్చని ప్రచారం జరుగుతోంది.


ఈ నేపథ్యంలో కీలకమైన ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ అభ్యర్థిని వైసీపీ మార్చొచ్చని ప్రచారం సాగుతోంది. 2019లో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్‌ రావు గెలుపొందారు. నందిగామ టీడీపీ కంచుకోటల్లో ఒకటి. ఆ పార్టీ ఆవిర్భవించాక 1989, 2019ల్లో మాత్రమే ఓడిపోయింది. మిగిలిన అన్నిసార్లు అంటే 1983, 1985, 1994, 1999, 2004, 2009, 2014ల్లో టీడీపీ అభ్యర్థులే విజయం సాధించడం గమనార్హం.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మొండితోక జగన్మోహన్‌ రావును మార్చాలని జగన్‌ నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో సీఎం వైఎస్‌ జగన్‌ వ్యక్తిగత భద్రతా అధికారి జోషి మరదలు అమర్లపూడి కీర్తి సౌజన్యను బరిలోకి దించుతారని చెబుతున్నారు.

ఇప్పటికే పార్టీకి చెందిన ముఖ్య నేతలతో పాటు సీఎం వైఎస్‌ జగన్‌ ను కూడా కలిసి తన పేరును పరిశీలించాల్సిందిగా కీర్తి సౌజన్య కోరారు. ప్రస్తుతం ఆమె వీరులపాడు జెడ్పీటీసీగా వ్యవహరిస్తున్నారు. కీర్తి సౌజన్య భర్త అమర్లపూడి శేఖర్‌.. క్రిస్టియన్‌ మైనారిటీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె బావ (భర్త సోదరుడు) అమర్లపూడి జోషి సీఎం సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల సహకారంతో టికెట్‌ కోసం ఆమె ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

మరోవైపు టీడీపీ తరఫున గత ఎన్నికల్లో గెలుపొందిన తంగిరాల సౌమ్యనే పోటీ చేయొచ్చని అంటున్నారు. 2009, 2014ల్లో తంగిరాల ప్రభాకరరావు నందిగామ నుంచి టీడీపీ తరఫున గెలుపొందారు. 2014లో గెలిచాక ఆయన మృతి చెందడంతో ఆయన కుమార్తె తంగిరాల సౌమ్య ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.

ఈ నేపథ్యంలో టీడీపీ తరఫున మహిళ పోటీ చేస్తుండటంతో వైసీపీ కూడా మహిళను బరిలో దింపడానికి నిర్ణయించిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్‌ వీరులపాడు జెడ్పీటీసీగా ఉన్న అమర్లపూడి కీర్తి సౌజన్య పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News