బీ అలర్ట్...ప్రజలకు చంద్రబాబు పిలుపు
ఏపీలో భారీ సంఖ్యలో దొంగ ఓట్లున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా తీవ్ర స్థాయిలో కొద్దిరోజులుగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీలో భారీ సంఖ్యలో దొంగ ఓట్లున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా తీవ్ర స్థాయిలో కొద్దిరోజులుగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓటరు జాబితాలో అక్రమాలకు అధికార పార్టీ నేతలు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో ఆరోపించారు. ఓటరు వెరిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో 20 లక్షల దొంగ ఓట్లను గుర్తించామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆ ఓటర్ల జాబితాపై సాక్ష్యాధారాలతో సహా వివరాలన్నింటినీ ప్రధాన ఎన్నికల అధికారికి చంద్రబాబు అందజేశారు.
రాష్ట్రంలో చనిపోయిన వారి ఓట్లు తొలగించకపోవడం, దొంగ ఓట్లు నమోదు చేయడం, టీడీపీకి అనుకూలం అని భావించే వారి ఓట్లను తొలగించడం, ఒక బూత్‌లో ఓట్లను మరో బూత్‌కు బదలాయించడం వంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరామని చంద్రబాబు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ నెల 21 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఏపీ ప్రజలను చంద్రబాబు హెచ్చరించారు.
ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఓటర్ లిస్టులో తమ పేరును చెక్ చేసుకోవాలని సూచించారు. ఒకవేళ ఓటు లేకుంటే తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టీడీపీకి చెందిన ఓట్లను వైసీపీ పెద్ద సంఖ్యలో తొలగిస్తోందని ఆరోపించారు. ఓటు మన బాధ్యత అని, ఓటుతోనే భద్రత అని, ఓటుతోనే భవిష్యత్తుకు భరోసా అని చంద్రబాబు పిలుపునిచ్చారు. #CheckyourvoteGetyourvote అనే హ్యాష్ ట్యాగ్ ను చంద్రబాబు ట్రెండ్ చేస్తున్నారు.