సీనియ‌ర్లు దీనికి ఒప్పుకొంటారా?

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ చేసిన ప్ర‌క‌ట‌న యువ త‌మ్ముళ్ల‌లో ఆశ‌లు చిగురింప చేస్తున్నాయి.

Update: 2025-01-29 03:56 GMT

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ చేసిన ప్ర‌క‌ట‌న యువ త‌మ్ముళ్ల‌లో ఆశ‌లు చిగురింప చేస్తున్నాయి. ప‌ద‌వుల కోసం క‌ళ్లు వాచేలా ఎదురు చూస్తున్న‌వారు చాలా మంది ఉన్నారు. అయితే.. సీనియర్లు.. వీరిని డామినేట్ చేస్తున్న క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ద‌వులు ద‌క్క‌ని వారు చాలా మంది ఉన్నారు. క్షేత్ర‌స్థాయిలో జెండాలు మోసి.. జేజేలు కొట్టేందుకు మాత్ర‌మే ప‌రిమితం అవుతున్న ఇలాంటి యువ నాయ‌కుల‌కు ఇప్పుడు అవ‌కాశం ద‌క్కే ఛాన్స్ ల‌భించింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి ప‌ద‌వి ల‌భిస్తే.. ఇక‌, ప‌దేళ్లో ప‌దిహేనేళ్లో వాటిలోనే ఉంటున్న‌వారు ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు వ‌ర్ల రామ‌య్య పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా ప‌ద‌వి లోకి వ‌చ్చి ప‌దేళ్లు దాటింది. అదేవిధంగా య‌న‌మ‌ల‌ రామ‌కృష్ణుడు నుంచి అనేక మంది సీనియ‌ర్లు ప‌ద‌వుల్లోనే ఉన్నారు. దీంతో యువ‌ త‌రానికి అవ‌కాశాలు స‌న్న‌గిల్లాయ‌న్న‌ది వాస్త‌వం. మ‌రీ ముఖ్యంగా గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ ప‌ద‌వుల్లో 33 శాతం యువ‌త‌కు కేటాయిస్తామ‌న్న చంద్ర‌బాబు హామీ కూడా అలానే ఉండిపోయింది.

ఇక‌, క్షేత్ర‌స్థాయిలో పార్టీ కోసం ప‌ని చేస్తున్న‌వారు..ప‌ద‌వులు ద‌క్క‌క‌.. క‌నీస ప్రాధాన్యం లేక ఇబ్బంది ప‌డుతున్న తీరు కూడా క‌ళ్ల‌కు క‌నిపిస్తోంది. ఇలాంటివారికి ఇప్పుడు నారా లోకేష్ ఆక్సిజ‌న్ అందించినట్టు అయింది. నారా లోకేష్ చెప్పిన‌ట్టు ఒక ప‌ద‌విలో మూడు సార్లు మాత్ర‌మే గ‌రిష్ఠంగా ఉండే మంత్రాన్ని అమ‌లు చేస్తే.. చాలా మంది సీనియ‌ర్లు ప‌క్క‌కు త‌ప్పుకొంటారు. ఒక ప‌ద‌వి వాస్త‌వానికి రెండేళ్లు లేదా మూడేళ్లు... ఇలా చూసుకుంటే ఆరేడు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సీనియ‌ర్లు ప‌క్క‌కు త‌ప్పుకోవాల్సిందే.

ఈ సూత్రం బాగానే ఉన్నా.. నారా లోకేష్ వ్యూహం అంత‌క‌న్నా బాగున్నా.. సీనియ‌ర్లు దీనికి ఒప్పుకొంటా రా? అనేది ముఖ్యం. పైగా... ప్ర‌క్షాళ‌న అంటూ మొద‌లు పెడితే.. ఆర్థికంగా బ‌లంగా ఉన్న సీనియ‌ర్లు.. పార్టీకి చేటు తెచ్చే ప్ర‌య‌త్నాలు చేసే ప్ర‌మాదం పొంచి ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ సూత్రం అమ‌లు ఎంత వ‌ర‌కు పార్టీకి మేలు చేస్తుంద‌న్న ప్ర‌శ్న కూడా తెర‌మీదికి వ‌స్తుంది. యువ నాయ‌క‌త్వానికి ఆహ్వానం ప‌ల‌కాల్సిన అవ‌స‌రం ఉన్నా.. సీనియ‌ర్ల‌ను మెప్పించి.. ఒప్పిస్తేనే ప‌నిజ‌రుగుతుంద‌న్న వాద‌న కూడా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News