లోకేష్ విత్ జై షా ...ఏం జరుగుతోంది ?
సరే ఈ ఇద్దరి గురించి అన్నీ చెప్పుకున్నా ఈ ఇద్దరి మధ్య కనెక్షన్ ఏంటి అన్నదే కదా ఇపుడు అర్ధం కావాల్సింది.;

నారా లోకేష్ గురించి అందరికీ తెలుసు. ఆయన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. మంత్రిగా కూడా ఉన్నారు. ఇక ఏపీ రాజకీయాల్లో లోకేష్ దూకుడుగా ఉన్నారు. ఆయన భావి రాజకీయాల్లో కీలకం అని అంతా భావిస్తారు.
మరో వైపు చూస్తే దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. ఆయన ఈ దేశానికి హోం మంత్రిగా గత ఆరేళ్ళుగా పనిచేస్తున్నారు. అమిత్ షా కుమారుడే జైషా. ఆయన ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గా ఉన్నారు. ఒక అంతర్జాతీయ క్రికెట్ సంస్థకు చైర్మన్ గా చిన్న వయసులోనే జై షా ఉండడం అంటే మామూలు విషయం కాదు.
మరో వైపు చూస్తే బీసీసీఐ కూడా ఆయన కనుసన్నల్లోనే ఉంది. ఈ క్రమంలో జై షా అత్యంత కీలకమైన వ్యక్తిగా జాతీయ తెర మీద ఉన్నారు. తండ్రి దేశాన్ని శాసించే స్థాయిలో ఉన్నా కూడా జై షా రాజకీయాల జోలికి పోవడంలేదు. ఆయన క్రికెట్ మీదనే తన ఆసక్తిని అంతా చూపిస్తున్నారు.
సరే ఈ ఇద్దరి గురించి అన్నీ చెప్పుకున్నా ఈ ఇద్దరి మధ్య కనెక్షన్ ఏంటి అన్నదే కదా ఇపుడు అర్ధం కావాల్సింది. ఎక్కడి జైషా ఎక్కడి లోకేష్ ఈ ఇద్దరి మధ్య ఏమి జరుగుతోంది. అంటే చాలా ఆసక్తికరమైన విషయాలే వెలుగు చూస్తాయి. జైషా తో నారా లోకేష్ బలమైన బంధాన్ని కలుపుకున్నారు. ఆయనతో మంచి దోస్తీ చేస్తున్నారు.
ఎంతలా అంటే కేవలం లోకేష్ పిలుపు మేరకే విశాఖలో ఉగాది రోజున జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కి జై షా వచ్చేటంతగా అని అంటున్నారు. ఈ ఇద్దరూ కలసి మ్యాచ్ ని తిలకించిన తరువాత డిన్నర్ కి కూడా కలసి చేశారు. ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రాణ మిత్రులు మాదిరిగా ఈ ఇద్దరూ మెలిగారు.
అయితే దీని కంటే ముందు కూడా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ లో కూడా ఈ ఇద్దరూ కలసి పాల్గొన్నారు. ఆనాడు కూడా లోకేష్ ఆహ్వానం మీదనే జై షా వచ్చారని చెప్పుకున్నారు. ఇంతలా జై షా తో సాన్నిహిత్యం లోకేష్ మెయింటెయిన్ చేయడమే రాజకీయంగా చర్చగా ఉంది.
కేంద్రంలోని బీజేపీకి సర్వం సహగా అమిత్ షా ఉన్నారు. పొత్తులు ఎత్తులు వ్యూహాలు అన్నీ ఆయనే చూస్తారు. ఇక ఏపీలో తెలుగుదేశంతో బీజేపీ పొత్తులు గట్టిగా ఉన్నాయి. ఒకనాడు బీజేపీకి టీడీపీకి మధ్య గ్యాప్ వచ్చింది. 2018 తరువాత టీడీపీ బీజేపీ విడిపోయాయి. అయితే మళ్ళీ రెండు పార్టీలు కలవడం ఒక విశేషం.
దాని కంటే ముందు నారా లోకేష్ విషయంలో టీడీపీ వారసత్వ రాజకీయాల విషయంలో బీజేపీ పెద్దలకు అభ్యంతరాలు ఉన్నాయని కూడా చెప్పుకున్నారు. కానీ ఇపుడు చూస్తే కేంద్ర బీజేపీ పెద్దలతో లోకేష్ కి మంచి సంబంధాలే ఏర్పడ్డాయని అంటున్నారు. ఎంతలా అంటే అమిత్ షా సైతం లోకేష్ విష్యంలో సానుకూలంగానే ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి.
ఆ మధ్యన విశాఖ మీటింగ్ కి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ అయితే నారా లోకేష్ ని ఫ్యామిలీతో సహా వచ్చి ఒకసారి తనను కలవాలని కోరారు. ఈ విధంగా బీజేపీ పెద్దలు కూడా లోకేష్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో జై షాతో లోకేష్ మిత్ర బంధం మరింతగా ఆయనకు బీజేపీ పెద్దల వద్ద సాన్నిహిత్యాన్ని అధికం చేస్తుంది అని అంటున్నారు.
ఏది ఏమైనా నారా లోకేష్ లౌక్యం చాకచక్యం విషయంలో తండ్రి చంద్రబాబు కంటే నాలుగాకులు ఎక్కువ చదివారనే అంటున్నారు. ఇక జైషా సహకారంతో ఏపీలో అద్భుతమైన క్రికెట్ స్టేడియం లను నిర్మించాలన్నది కూడా లోకేష్ ప్లాన్ గా ఉంది అని అంటున్నారు. సో లోకేష్ రాజకీయ చాణక్యం బాగానే ఉందని అంతా అంటున్నారు.