లోకేశ్ రూల్ చంద్రబాబుకూ వర్తిస్తుందా?

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదిస్తున్న సూచనలు ఆ పార్టీలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.

Update: 2025-01-31 09:30 GMT

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదిస్తున్న సూచనలు ఆ పార్టీలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. పార్టీలో వరుసగా మూడు సార్లు ఒకే పదవిలో కొనసాగుతున్న వారు ఆ పోస్టు నుంచి తప్పుకోవాలని, కొత్తవారికి అవకాశమివ్వాలని లోకేశ్ ప్రతిపాదిస్తున్నారు. దీనిపై ఆ పార్టీలో అనేక రకాల చర్చ కొనసాగుతోంది. అవసరమైతే తాను కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటానని లోకేశ్ చెబుతున్నారు. పార్టీలో కొందరు సీనియర్లను టార్గెట్ చేసుకుని ఆయన చేస్తున్న ఈ సూచలనపై ఒక కొత్త ప్రశ్న తెరపైకి వస్తోంది.

తెలుగుదేశం పార్టీది 43 ఏళ్ల చరిత్ర. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న నేతలు ఎందరో ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి 1995 వరకు వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తే.. ఆ తర్వాత చంద్రబాబు ఆ స్థానంలోకి వచ్చారు. దాదాపు 30 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబే ఉన్నారు. 2014లో పార్టీని జాతీయస్థాయికి విస్తరించిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించగా, చంద్రబాబు జాతీయ అధ్యక్షుడయ్యారు. ఇక ఆయనతోపాటు పొలిటిబ్యూరో సభ్యులుగా, పార్టీ జాతీయ కార్యవర్గంలోనూ చాలా మంది నాయకులు ఇరవై ముప్పయ్యేళ్లుగా కొనసాగుతున్న నేతలు వారు ఉన్నారు. వీరంతా ఇప్పుడు లోకేశ్ ప్రతిపాదనతో తప్పుకోవాల్సివస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

టీడీపీలో చాలా మంది లీడర్లు ఆవిర్భావం నుంచి ఉన్నారు. వారు ఇప్పటికీ పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పొలిట్ బ్యూరో సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. వీరిలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ర్ట మాజీ మంత్రులు యనమల రామక్రిష్ణుడు, కేఈ క్రిష్ణమూర్తి వంటివారు ఉన్నారు. దాదాపు ఈ ముగ్గురూ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పుడప్పుడు పార్టీ వేదికలపై కనిపిస్తున్నారు. వయసు రీత్యా వచ్చే ఎన్నికల నాటికి వీరు క్రియాశీలంగా పనిచేసే అవకాశాలు చాలా తక్కువనే అభిప్రాయం ఉంది. దీంతో ఇలాంటి సీనియర్ నేతలను దృష్టిలో పెట్టుకునే లోకేశ్ తాజా ప్రతిపాదన తెస్తున్నారని అంటున్నారు.

అయితే ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా వినిపిస్తోంది. లోకేశ్ ప్రతిపాదన పార్టీలో అందరికీ వర్తిస్తుందా? లేదా? అనే ప్రశ్న ప్రస్తావిస్తున్నారు. లోకేశ్ సూచన ప్రకారం వరుసగా ఒకే పదవిలో ఉన్నవారు తమ పదవి నుంచి తప్పుకోవాలంటే పార్టీ అధినేత చంద్రబాబు కూడా తన పదవి నుంచి తప్పుకుని వేరొకరికి అవకాశమిస్తారా? అని అడుగుతున్నారు. జాతీయ కార్యదర్శిగా లోకేశ్ తప్పుకోవడంతో ఆయనకు ప్రమోషన్ ఇచ్చి పార్టీ అధ్యక్షుడిని చేస్తారని.. అదేసమయంలో చంద్రబాబు పూర్తిగా ప్రభుత్వ విధులకే పరిమితమై పార్టీ గౌరవాధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ప్రస్తుతానికి లోకేశ్ ప్రతిపాదనలు అధినేతకు వర్తించవని, మరికొన్నాళ్లు చంద్రబాబు అధ్యక్షుడిగా కొనసాగాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి లోకేశ్ వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చిన ప్రతిపాదన ఎటువంటి ముగింపునిస్తుందో చూడాల్సివుంది.

Tags:    

Similar News