లోకేష్ మోసుకొచ్చేది ఎన్ని లక్షల కోట్లు ?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అమెరికా టూర్ పెట్టుకున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అమెరికా టూర్ పెట్టుకున్నారు. ఈ నెల 25 నుంచి ఆయన వారం రోజుల పాటు అమెరికా పర్యటన చేయబోతున్నారు. అమెరికాలో పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా లోకేష్ టూర్ సాగనుంది. ఈ టూర్ మీద లోకేష్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
ఎందుకంటే ఆయన పదే పదే తన అమెరికా టూర్ గురించి మీడియా ముందు ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇటీవల విశాఖ వచ్చినపుడు కూడా తాను రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకుని వస్తానని చెప్పారు. అదే విధంగా తాను అమెరికాకు త్వరలో వెళ్తున్నానని అక్కడ నుంది కూడా ఏపీకి పెట్టుబడులు తీసుకుని వస్తామని ధీమాగా చెప్పారు.
ఆ మధ్యన అంటే నెలన్నర క్రితం తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ వేశారు. ఆయన కూడా చాలా రోజులు ఉండి తెలంగాణాకు పెట్టుబడులు పెట్టాలని అనేక పెద్ద సంస్థలను పారిశ్రామికవేత్తలను కోరారు. పెద్ద ఎత్తున తెలంగాణాకు పెట్టుబడులు వస్తాయని ప్రచారం సాగింది. అయితే అవి గ్రౌండ్ అయినప్పుడే ఎవరైనా ఆనందించేది అని కూడా అన్నారు.
ఇపుడు లోకేష్ వెళ్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి వెళ్ళినప్పటి టైమే సరైనది కాదు అని అంతా అన్నారు. ఎందుకంటే ప్రస్తుతం అమెరికా ఆర్ధిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. దాంతో పాటు అక్కడ రాజకీయ సమరం సాగుతోంది అని కూడా అంతా అంటూ వచ్చారు. ఇక ఇపుడు చూస్తే సరిగ్గా అమెరికా ఎన్నికలు దగ్గరలో పెట్టుకుని లోకేష్ టూర్ చేస్తున్నారు.
అందరి మనసు కాబోయే ప్రెసిడెంట్ ఎవరు అన్న దాని మీద ఉంటుంది. కమలా హరీస్ అయితే ఒక లెక్క ట్రంప్ తిరిగి అయితే మరో లెక్క అన్నట్లుగా అక్కడ పారిశ్రామికవేత్తలు ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా అమెరికా ఎన్నికలు పూర్తి అయి కొత్త ప్రెసిడెంట్ ప్రమాణం చేశాక ఆయన విధానాలు బట్టి అమెరికా టూర్ పెట్టుకుంటే బాగుండేది అని అంటున్నారు.
అంటే నవంబర్ మొదటి మంగళవారంలో అమెరికా ఎన్నికలు జరిగినా ఫలితాలు వచ్చినా కొత్త అధ్యక్షుడు జనవరిలోనే ప్రమాణం చేస్తారు ఆ తరువాత తమ పాలసీ గురించి చెబుతారు. సరే అంత వరకూ కాకున్నా ఫలితాలు వచ్చేంతవరకూ ఆగి అపుడు వెళ్ళినా ఉపయోగం ఉంటుందని అంటున్నారు. ఇపుడు టూర్ వేస్తే ఎవరూ పెద్దగా రియాక్ట్ అవుతారా అన్న చర్చ ఉంది.
మరో వైపు చూస్తే లోకేష్ కి ఇది మంత్రిగా కీలకమైన అమెరికా టూర్. అందువల్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది అని అంటున్నారు. ఆయన ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు మోసుకుని వస్తారు అన్నది కూడా అంతా చూస్తారు. మరి లోకేష్ ప్లాన్స్ ఏమిటో ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో కూడా చూడాల్సిందే. మొత్తం మీద లోకేష్ అమెరికా టూర్ మీద అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అన్నది నిజం.